సూట్‌పేరుతో మోసం చేస్తే చర్యలు

8 Aug, 2017 22:49 IST|Sakshi
  • యార్డు సెక్రటరీల సమీక్షలో జేసీ–2 ఖాజామొహిద్దీన్‌
  • అనంతపురం అగ్రికల్చర్‌: రైతుబంధు పథకం అమలు, ఫీజు వసూళ్ల సాధనలో మార్కెటింగ్‌శాఖ పనితీరు  బాగోలేగని జేసీ–2 ఖాజా మొహిద్దీన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్థానిక మార్కెటింగ్‌శాఖ ఏడీ కార్యాలయంలో ఏడీ హిమశైలతో కలిసి మార్కెట్‌యార్డు సెక్రటరీలు, సూపర్‌వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

    ప్రస్తుత పరిస్థితుల్లో  రైతులకు వెన్నుదున్నుగా నిలవడంలో మార్కెటింగ్‌శాఖ కీలక భూమిక పోషించాల్సి ఉందన్నారు. అయినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. చీనీ, ఇతర పండ్ల ఉత్పత్తులు పండిస్తున్న రైతులను సూట్లు (తరుగు) పేరుతో వ్యాపారులు, దళారులు మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున... తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను మోసం చేసే వారిపై మార్కెటింగ్, పోలీసు చట్టాలు ప్రయోగించి శిక్షించాలని ఆదేశించారు. రైతుబంధు పథకం కింద జిల్లాకు రూ.2.86 కోట్లు కేటాయించినా కేవలం రూ.11.24 లక్షలు మాత్రమే ఖర్చు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 2017–18 ఆర్థిక సంవత్సరంలో 13 మార్కెట్‌యార్డుల ద్వారా రూ.14.11 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యం నిర్దేశించుకోగా... ఇప్పటివరకు కేవలం రూ.3.14 కోట్లు వసూలైందన్నారు. అందులోనూ తనకల్లు, ధర్మవరం, రాయదుర్గం లాంటి కొన్ని యార్డుల్లో వసూళ్లు బాగా పడిపోవడంపై కారణాలు ఆరాతీశారు.  రానున్న రోజుల్లో ఆకస్మిక తనిఖీల్లో కొనసాగిస్తామని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు