నేటి నుంచి ‘రైల్ హమ్‌సఫర్ సప్తాహ్’.

26 May, 2016 03:53 IST|Sakshi
నేటి నుంచి ‘రైల్ హమ్‌సఫర్ సప్తాహ్’.

వారం పాటు పలు అంశాలపై ప్రచారం
 

సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలపై ఈ నెల 26 నుంచి జూన్ 1 వరకు దక్షిణ మధ్య రైల్వే ‘రైల్ హమ్‌సఫర్ సప్తాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా, అదనపు జనరల్ మేనేజర్, వివిధ డివిజన్‌లకు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్‌లు, అధికారులు ఈ  వారోత్సవాల్లో  పాల్గొంటారు. మొదటి రోజు ‘స్వచ్ఛ దివస్’ నిర్వహిస్తారు. 2వ రోజు ‘సత్కార్ దినోత్సవ్’లో భాగంగా స్టేషన్‌లు, రైళ్లలోని ఆహార కేంద్రాల్లో పరిశుభ్రత, తినుబండారాల నాణ్యతాప్రమాణాలు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. మూడో రోజు ‘సేవా దివస్’లో భాగంగా అన్ని రైళ్లలో సదుపాయాలు, సేవలపై ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటారు.

ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపడతారు. 4వ రోజు సతర్కతా దినోత్సవంలో భాగంగా అన్ని  రైళ్లు నిర్ణీత సమయానికి అనుగుణంగా నడుస్తున్నదీ లేనిదీ తనిఖీలు చేస్తారు. 5వ రోజు ‘సామంజస్య దినోత్సవ్’లో భాగంగా అన్ని రైల్వే కాలనీల్లో ఇళ్ల నిర్వహణ, పరిశుభ్రతలపై తనిఖీలు నిర్వహిస్తారు. 6వ రోజు నిర్వహించే ‘సంయోజన్ దినోత్సవ్’లో పెద్ద ఎత్తున సరుకు రవాణా చేసే ఖాతాదారులతో జనరల్ మేనేజర్, డీఆర్‌ఎంలు సమావేశాలు నిర్వహించి రవాణా విభాగంలో రైల్వేశాఖ సంస్కరణలను వివరిస్తారు. 7వ రోజు జూన్ 1వ తేదీన జరిగే ‘సంచార్ దినోత్సవ్’లో ఈ వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమాలను సమీక్షిస్తారు.
 
 

మరిన్ని వార్తలు