హెటెరో సామాజిక సేవ ప్రశంసనీయం

8 Jul, 2014 00:49 IST|Sakshi
Hetero admirable social service
 •      పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత
 •      5 వేల మంది విద్యార్థులకు స్కూలు బ్యాగులు
 •      పోలీస్ శాఖ నిర్మాణానికి సంస్థ అంగీకారం
 • నక్కపల్లి : మండలంలో విద్య, వైద్య, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు హెటెరో యాజమాన్యం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని 23 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే సుమారు 5వేల మంది విద్యార్థులకు సోమవారం హెటోరో సంస్థ ఉచితంగా స్కూలు బ్యాగులు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేసింది.

  నక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో అనిత మాట్లాడుతూ హెటెరో సంస్థతో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిని చేయాలని ప్రజలకు, వివిధ పార్టీల నేతలకు సూచించారు. నక్కపల్లికి మంజూరైన సర్కిల్ పోలీస్‌స్టేషన్  భవనాల నిర్మాణానికి నిధుల్లేక జాప్యం జరుగుతోందని తెలుసుకున్న హెటెరో యాజమాన్యం భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావడం గర్వకారణమన్నారు.

  నక్కపల్లి ఉన్నత పాఠశాలలో శిథిల భవనాల స్థానంలో అదనపు తరగతి గదులను నిర్మించి వసతి సమస్యను పరిష్కరించాలని, మండల ప్రజల వైద్య అవసరాలకు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సంస్థతో పరస్పర సహకార ధోరణితో వ్యవహరిస్తామని, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు. సంస్థ డెరక్టర్(ఫైనాన్స్) భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో కంటి వ్యాధులతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా కంటిచూపు పేరుతో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి శ్రస్త్రచికిత్స చేయిస్తామని తెలిపారు.

  అవసరమైతే వారికి నిరంతర వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని సంస్థ చైర్మన్ పార్థసారధి రెడ్డి భావిస్తున్నట్లు తెలిపారు. ఏటా యలమంచిలి డివిజన్ పరిధిలో పదోతరగతి చదువుతున్న 2వేలమంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, సంస్థ పరిసర ప్రాంత గ్రామాల విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్నామని, పాఠశాలల్లో ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు.

  వేంపాడు, ఉపమాక, నక్కపల్లి గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాల కోసం మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసామన్నారు. జిల్లా ఉప విద్యాశాఖాదికారి లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెటెరో సంస్థ దయతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వీసం వెంకటలక్ష్మి, తహశీల్దార్ జగన్నాథరావు, ఎంపీడీవో కృష్ణ, ఎంఈవో ప్రభాకర్, ప్రధానోపాధ్యాయుడు నూకరాజు, డీజీఎం గోపాలకృష్ణారెడ్డి, ప్రతినిధులు మురళి, రజనీకాంత్, సుబ్బారెడ్డి,పార్థసారధి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
   

మరిన్ని వార్తలు