శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇక ఐఏఎస్‌ పాలన?

20 Jul, 2016 22:40 IST|Sakshi
శ్రీకాళహస్తీశ్వరాలయం


– గాడిలో పెట్టేందుకు ఐఏఎస్‌ను నియమించే యోచనలో ప్రభుత్వం
– త్వరలో నిర్ణయం
శ్రీకాళహస్తి : రాజకీయాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీకాళహస్తీశ్వరాలయ పాలనను గాడిలో పెట్టేందుకు ఈవోగా ఓ ఐఏఎస్‌ అధికారిని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి దేవస్థానానికి రోజుకు సరాసరి 35వేల మంది భక్తులు వస్తుంటారు. ఏడాదికి వంద కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. వందల ఎకరాలు భూములున్నాయి. అనుబంధ ఆలయాలు చాలా ఉన్నాయి. కోట్లాది రూపాయలు విలువచేసే బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి ఆలయ పెత్తనం విషయంలో అదే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఈవోలపై ఒత్తిడి తీసుకురావడంతో రెండేళ్లలో ఆరుగురు ఈవోలు బదిలీపై వెళ్లారు. కాంట్రాక్ట్‌ల పేరుతో ఇష్టారాజ్యంగా ఆలయ సొత్తును దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటివరకు ఆలయానికి ఈవోలుగా స్పెషల్‌ గ్రేడ్‌ డెప్యూటి కలెక్టర్, జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులు మాత్రమే ఉన్నారు. పాలన గాడిలో పడాలంటే ఐఏఎస్‌ స్థాయి అధికారిని నియమించాలనే వాదన వస్తోంది. ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాల్లో ఐఏఎస్‌ అధికారులను ఈవోలుగా నియమించిన విషయం తెలిసిందే. అదే తరహాలో శ్రీకాళహస్తి దేవస్థానానికి ఐఏఎస్‌ అధికారిని అతిత్వరలో నియమించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

మరిన్ని వార్తలు