గుట్టపాడు వద్ద ఉక్కు కర్మాగారం

19 Oct, 2016 23:30 IST|Sakshi
- రూ.2935 కోట్లతో ప్రభుత్వ ఆమోదం 
- జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ 
 
ఓర్వకల్లు: మండల పరిధిలో గుట్టపాడు వద్ద 370 ఎకరాల్లో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ తెలిపారు. ఇందుకు రూ.2935 కోట్లతో ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పరిశ్రమలో దశల వారీగా 14,400 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బుధశారం శకునాల గ్రామ సమీపంలో సోలార్‌ పవర్‌ప్లాంట్‌ పనులను  కలెక్టర్‌ విజయమోహన్, ఆర్‌డీఓ రఘుబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పాలకొలను గ్రామం వద్ద 2700 ఎకరాల్లో డీఆర్‌డీఓ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ పరిశ్రమ స్థాపన జరుగుతుందన్నారు. ఇందుకు భూ కేటాయింపులు చేశామని, నవంబరు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద రూ.54 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఓర్వకల్లు సమీంపలో 300 ఎకరాలలో ఎయిర్‌పోర్టు, 150 ఎకరాలలో ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా జూపాడుబంగ్లా మీదుగా రూ.350 కోట్లతో ఓర్వకల్లు వరకు నీటి వనరులను సమకూర్చుతామన్నారు. సోలార్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వానికి నివేదించామని, ఆదేశాలు రాగానే రూ.35 కోట్ల పరిహారం అందజేస్తామన్నారు.
మరిన్ని వార్తలు