కృష్ణమ్మ కరుణిస్తేనే...

1 Aug, 2016 00:30 IST|Sakshi
సోమశిల వద్ద కృష్ణానదిలో నీళ్లు
  •  పుష్కరఘాట్లకు చేరని వరదనీరు
  •  ఎగువ నుంచి విడుదలచేస్తేనే నీళ్లొచ్చేది
  •  శ్రీశైలం, నాగార్జున్‌ సాగర్‌ రిజర్వాయర్లు 
  •  నిండితేనే పుష్కర స్నానాలకు నీళ్లు
  •  నీళ్లురాని పక్షంలో షవర్లు ఏర్పాటుకు చర్యలు
  • కొల్లాపూర్‌/అచ్చంపేట: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ గలగల పారుతున్నా.. నీటి ఉధృతి తక్కువగా ఉండడంతో ఘాట్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. పుష్కరస్నానాల నాటికి ఘాట్ల వద్దకు నీళ్లు చేరుకుంటాయో.. లేదోననే ఆందోళన అటు అధికారులు, ఇటు భక్తుల్లో నెలకొంది. వచ్చే రెండువారాల్లో జూరాల, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి వరద జలాలను కిందికి వదిలితేనే ఘాట్ల వద్దకు పూర్తిస్థాయికి నీళ్లు చేరే అవకాశం ఉంది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని 13గ్రామాల్లో పుష్కరాలు జరగనున్నాయి. కొల్లాపూర్‌ మండలంలో నాలుగు గ్రామాలు, వీపనగండ్ల మండలంలో ఐదు గ్రామాల గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. ఆయా గ్రామాల్లో నదీ బ్యాక్‌వాటర్‌ నిల్వ ఉంటే ప్రాంతాల్లో 16పుష్కరఘాట్లు నిర్మిస్తున్నారు. నెలరోజుల క్రితం వరకు నది చిన్నపాయగా పారుతూ ఉండేది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద జలాలు రావడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండు వారాల్లో జూరాల డ్యాం నుంచి శ్రీశైలం జలాశయానికి రెండు పర్యాయాలు నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. 
     
    ప్రస్తుతం ఇలా..
    ప్రస్తుతం కొల్లాపూర్‌ మండలం అమరిగిరిలో ఘాట్‌కు సమీపంలోకి నదీనీళ్లు చేరాయి. సోమశిల, మంచాలకట్ట ఘాట్ల సమీపంలో సమృద్ధిగా కనిపిస్తున్నప్పటికీ ఇంకా అరకిలోమీటర్‌ దూరంపైగా ఉన్నాయి. అలాగే మల్లేశ్వరం ఘాట్‌కు కిలోమీటర్‌ దూరంలో నీళ్లు ఉన్నాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ పెరిగితే సోమశిల, అమరగిరి ఘాట్లకు నీళ్లు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. వీపనగండ్ల మండలంలోని చెల్లెపాడు ఘాట్‌కు అరకిలోమీటర్‌కు నీళ్లు చేరాయి. జటప్రోల్‌ ఘాట్‌కు నదీ బ్యాక్‌వాటర్‌ చాలా దూరంలో ఉంది. పెద్దమారూర్, గూడెం, బెక్కెం, వెల్టూరు, అయ్యవారిపల్లి, కొప్పునూరు, కాలూరులో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్‌ నీటినిల్వ 850అడుగులకు చేరితేనే దాదాపు అన్ని ఘాట్లకు నీళ్లొచ్చే అవకాశం ఉంది. ఘాట్లకు దిగువభాగంలో నదీతీరం అంతా ఒండ్రుమట్టితో కూడుకుని ఉండడంతో భక్తులు బురదలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఘాట్ల వరకూ నీళ్లురాని పక్షంలో షవర్లు ఏర్పాటుచేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 
     
     వట్టిపోయిన బక్కాలింగాయపల్లి ఘాట్‌
    అచ్చంపేట మండలం బక్కాలింగాయపల్లి పుష్కరఘాట్‌ నీళ్లు లేక వెలవెలబోతుంది. నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ కింద రూ.1.37కోట్లతో
     ఈ పుష్కరఘాట్‌ను నిర్మించారు. అధికారులు ముందుచూపు లేకుండా ఈ ఘాట్‌ను నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. పుష్కరాలకు కేవలం 12రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు నీళ్లొస్తేనే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. నీళ్లు రాకపోతే ఈ ఘాట్‌తో ఎలాంటి ఉపయోగం లేదు. ప్రస్తుతం ఈ ఘాట్‌ నుంచి ఏడు కి.మీ దూరంలో నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ ఉంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 10 నుంచి 20 టీఎంసీల నీటిని విడుదల చేయిస్తేనే ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్‌లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో బక్కాలింగాయిపల్లి ఘాట్‌లో షవర్స్‌ను ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
     
    పాతాళగంగ వద్ద అదే పరిస్థితి 
    శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం కింద ఉన్న పాతాళగంగ వద్ద తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వేర్వేరుగా పుష్కరఘాట్లను ఏర్పాటుచేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రూ.1.94కోట్లతో పుష్కరఘాట్ల పనులు చేపట్టింది. ప్రస్తుతం ఇక్కడ నీటికొరత ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి దిగువకు నీటిని వదిలితేనే ఈ ఘాట్లకు నీళ్లు చేరే అవకాశం ఉంది. పుష్కరాల సమయానికి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు నిండితేనే పుష్కరభక్తులను కనువిందు చేయనుంది. 
మరిన్ని వార్తలు