‘జలధి’తరంగం

13 Oct, 2016 22:37 IST|Sakshi
‘జలధి’తరంగం

–  కనుల పండువగా కుళ్లాయిస్వామి జలధోత్సవం
– భక్తులతో పోటెత్తిన గూగూడు
– అగ్నిగుండ ప్రవేశం చేసిన పీర్లు
– ముగిసిన మొహర్రం ఉత్సవాలు


నార్పల : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు (మొహర్రం వేడుకలు) అంగరంగ వైభవంగా ముగిశాయి. గురువారం చివరి రోజు జలధోత్సవం కనులపండువగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. బుధవారం సాయంత్రం నుంచే గూగూడుకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల పరిసరాలలో పాటు గ్రామం మొత్తం జనసంద్రమైంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు కుళ్లాయిస్వామి గ్రామోత్సవం ప్రారంభమైంది. పీర్లను తిరుమల కొండారెడ్డి వంశీకులు ఎత్తుకున్నారు. కొబ్బరి దివిటీల వెలుగులో గ్రామంలో మెరవణి చేశారు. ఎగువగేరి, రెడ్డివారి వీధి, ఎస్సీకాలనీ, దిగువగేరిలో ఊరేగించారు. అనంతరం స్వామివారి సేవకులు అగ్నిగుండంలో మండుతున్న మొద్దులను పెకలించి నిప్పులను చదును చేశారు. పీర్ల ఎదుట ప్రధాన అర్చకుడు హుస్సేనప్ప చక్కెర చదివింపులు చేశారు.

అనంతరం పూజలు చేసి.. ప్రసాదం చేతపట్టుకుని ఆలయ పూజారి అగ్నిగుండంలో నడిచారు. గోవింద నామస్మరణ చేస్తూ..పలువురు భక్తులు ఆయన్ను అనుసరించారు. చివరగా కుళ్లాయిస్వామి అగ్నిగుండంలో ప్రవేశించారు. ఈ దశ్యాన్ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. సాయంత్రం మూడు గంటలకు కుళ్లాయిస్వామి పీర్లను గ్రామ సమీపంలోని కుర్లగుట్ట వద్దకు తీసుకెళ్లి జలధోత్సవం నిర్వహించారు. అంతటితో ఉత్సవాలు ముగిశాయి. శనివారం సాయంత్రం చావిడి అరుగుపై కుళ్లాయిస్వామి మూలవిరాట్‌(పీరు)ను మాత్రమే చివరి దర్శనం ఉంటుంది.  ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 350 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.

మరిన్ని వార్తలు