భూదాహం

13 Aug, 2016 00:25 IST|Sakshi
 
  • రూ.కోటి ప్రభుత్వ భూమిపై అధికార పార్టీ నాయకుల కన్ను
  • 1బీ, అడంగల్‌లో పేర్లు నమోదు
  • రెవెన్యూ అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
ఉదయగిరి:మండలంలోని గుడినరవ గ్రామంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ పేర్లు 1బీ, అడంగల్‌లో నమోదుచేసుకున్న వైనం బయటపడింది. సుమారు రూ.కోటి విలువచేసే ఈ భూమిపై గ్రామస్తుల మధ్యన పెద్ద రగడ సాగుతోంది. అనాదినుంచి గ్రామ అవసరాలకు ఉపయోగిస్తున్న భూమిని అధికార పార్టీ నేతలు హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రామానికి పడమటివైపు ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూముల్లో కొంతమేర కొండలున్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు, ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌కు పోను మరో 30 ఎకరాలు అనాదీన భూమి ఉంది. దీనిని గ్రామస్తులకు చెందిన పశువులు, మేకలు, గొర్రెలు మేతకు æఉపయోగిస్తున్నారు. గతంలో పలువురు ఈ భూమిని కాజేయాలని ప్రయత్నం చేసినా సమష్టిగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ నాటి పాలకులు కూడా గ్రామస్తుల అవసరాల దృష్ట్యా భూమి పంపిణీ చేసే కార్యక్రమాన్ని విరమించుకున్నారు. 
భూమి కబ్జాకు అధికార పార్టీ నాయకుడి వ్యూహం
ఈ గ్రామానికి చెందిన ఓ అధికారపార్టీ నాయకుడు ఎంతో విలువైన భూమిని కాజేయాలని వ్యూహం పన్నాడు. ఈ క్రమంలో గత నెల్లో పదవీ విరమణ చేసిన ఓ రెవెన్యూ అధికారి సహకారంతో ఆ ప్రభుత్వ భూమిలో ఏడుగురు పేర్లు ఉండగా, 1బీ అడంగల్‌లో పేర్లు నమోదు చేయించుకున్నాడు. నెలరోజుల ముం దువరకు ప్రభుత్వ భూములుగా ఉన్న సర్వే నంబరు 1/3లో రెండ్రోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఈ సర్వే నంబరును పరిశీలించగా కొంతమంది గ్రామస్తులతో పాటు పక్క గ్రామమైన ఎస్సీ చింతల గ్రామాల వారిపేర్లు కూడా ఉండటంతో విస్తుపోయారు. వెంటనే తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ అధకారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ 1బీ, అడంగల్‌ను ఇటీవల మార్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై తాజాగా పదవీ విరమణ చేసిన రెవెన్యూ అధికారి డిజిటల్‌ సంతకం ఉండటం విశేషం. 
అధికార పార్టీ నాయకుల వాదన
1995లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే దానికి సంబంధించి గ్రామలెక్కల 1బీ, అడంగల్‌ పుస్తకాల్లో ఎక్కడా వీరిపేర్లు లేవు. బోగస్‌ పట్టాలు సృష్టించి స్వాహాచేసే ప్రయత్నాలు చేస్తున్నారని తేటతెల్లమవుతోంది. 
గ్రామంలో రగడ
గ్రామ అవసరాల కోసం ఉంచుకున్న ఈ భూమిని అధికార పార్టీ నాయకుడు కాజేందుకు చేస్తున్న ప్రయత్నంతో గ్రామస్తుల మధ్య వివాదం నెలకునివుంది. ఈ భూములు గ్రామ అవసరాలకు ఉపయోగించుకుంటున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరేవారికి ఇవ్వడానికి వీల్లేదని గట్టిగాపట్టు పడుతున్నారు. రూ.కోటికి పైగా విలువచేసే ఈ భూమిని కాజేసే ప్రయత్నంపై మండిపడుతున్నారు.  
మరిన్ని వార్తలు