పురోగతి లేని లేపాక్షి అభివృద్ధి

20 Apr, 2017 23:41 IST|Sakshi
పురోగతి లేని లేపాక్షి అభివృద్ధి

లేపాక్షి వేదికగా గత ఏడాది జరిగిన నంది ఉత్సవాల్లో ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే ఎన్‌.బాలకృష్ణ ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సుమారు 15 నెలలు గడుస్తున్నా వారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. ఫలితంగా లేపాక్షిలో అభివృద్ధి పడకేసింది.
- లేపాక్షి (హిందూపురం)

లేపాక్షి వేదికగా గత ఏడాది నంది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. స్వయంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలో దిగి ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అందులో భాగంగానే రూ.1.50 కోట్లతో లేపాక్షి నుంచి బింగిపల్లి, జఠాయు మోక్ష ఘాట్‌ వరకూ బీటీ రోడ్డు వేశారు. అయితే ఈ రహదారిలో ఉన్న కల్వర్టు పనులు నేటికీ పూర్తి చేయలేకపోయారు. రూ. 20 లక్షలతో నంది విగ్రహం నుంచి జఠాయు కొండ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేశారు.

హామీలు ఇలా.. నెరవేరిందెలా!
నంది ఉత్సవాల సాక్షిగా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. రూ. 30 లక్షలతో కోనేరు అభివృద్ధి చేపట్టనున్నట్లు హామీనిచ్చారు. ఇప్పటి వరకూ దాని అతీగతీ లేకుండా పోయింది. పాత మరుగుదొడ్ల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు రూ. 21 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పి,  వెనువెంటనే పాత మరుగుదొడ్లను కూల్చివేయించారు. కొత్తవి నేటికీ పూర్తి చేయలేకపోయారు. జఠాయు ఘాట్‌ పునరుద్ధరణకు రూ. 8.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు హామీనిచ్చారు. ముళ్లపొదలు మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారు. పెద్దగుండ్ల మీద రూ. 10 లక్షలతో జఠాయు పక్షి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దాని ఊసెత్తడం లేదు. ఆర్టీసీ బస్టాండ్‌ ప్రహరీ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. అయితే రూ. 50 వేలుతో పాత ప్రహరీకే మరమ్మతులు చేశారు. ఇలాగైతే లేపాక్షి అభివృద్ధి ఎన్నడు జరుగుతుందోనన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు