ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి

9 Sep, 2016 22:13 IST|Sakshi
రాయికల్‌ : అధిక రక్తస్రావం కారణంగా ఓ బాలింత మృతిచెందింది. వివరాలు.. మల్లాపూర్‌ మండలం సాతారం గ్రామానికి చెందిన మంద జ్యోతి (26) ప్రసవం కోసం శుక్రవారం రాయికల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు చైతన్యసుధ పర్యవేక్షణలో ఆమె పాపకు జన్మనిచ్చింది. అనంతరం తీవ్ర రక్తస్రావం అయింది. అప్రమత్తమైన వైద్యురాలు జగిత్యాల ఏరియా ఆస్పత్రి నుంచి రక్తం తెప్పించారు. అయితే అప్పటికే పల్స్‌రేట్‌ పడిపోవడంతో బాలింత జ్యోతి మృతిచెందింది. ఆగ్రహానికి గురైన మృతురాలి బంధువులు ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై మధూకర్, ఎంపీపీ పడాల పూర్ణిమ, సర్పంచ్‌ రాజిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. వైద్యురాలు చేసిన చికిత్సలు వివరించారు. దీంతో వారు శాంతించారు. ఈ విషయమై వైద్యురాలు చైతన్యసుధను వివరణ కోరగా ఉదయం 6 గంటల నుంచి ముగ్గురికి ప్రసవాలు చేశామని, మంద జ్యోతికి ప్రసవం బాగానే జరిగినట్లు వివరించారు. ఒకేసారి రక్తస్రావం తీవ్రం కావడంతో పల్స్‌రేట్‌ పడిపోయి మృతిచెందినట్లు తెలిపారు.
 
 
మరిన్ని వార్తలు