శిథిలావస్థలో మైలవరం మ్యూజియం

23 Mar, 2017 20:12 IST|Sakshi
శిథిలావస్థలో మైలవరం మ్యూజియం

జమ్మలమడుగు(మైలవరం): మండల కేంద్రమైన మైలవరంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియం శిథిలావస్థకు చేరుకుంది. ఈ మ్యూజియాన్ని నిత్యం పర్యాటకులు సందర్శిస్తుంటారు. అందులో ఉన్న కళాఖండాలతోపాటు ప్రాచీన కాలంలో రాజులు ఉపయోగించిన కత్తులు, ఆయుధాలను ఆసక్తిగా తిలకిస్తారు. ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి దాదాపు 30ఏళ్లు అవడంతో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అంతేకాక స్లాబు పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఇరిగేషన్‌ స్థలంలో మ్యూజియాన్ని నూతనంగా నిర్మాణం చేపడుతామని నాలుగేళ్ల క్రితం పేర్కొన్నారు. ఈ మేరకు స్థలాన్ని ఇరిగేషన్‌ అధికారులు పురావస్తుశాఖకు కేటాయించారని సమాచారం. అధికారులు కూడ రెండు సార్లు మ్యూజియాన్ని పరిశీలించి వెళ్లారు.అయితే నూతన మ్యూజియం భవన నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.

ఆరుబయటనే పురాతన విగ్రహాలు..: మైలవరం జలాశయ నిర్మాణ సమయంలో రాజులు ఉపయోగించిన కత్తులు, ఆయుధాలు, అలనాటి విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని భద్రపరిచేందుకు ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో వాటిని ఉంచారు. అయితే చాలా విగ్రహాలను మాత్రం ఆరుబయటే ఉంచడంతో అవి పాడుపడ్డాయి. బయట వాటికి రక్షణ లేకపోవడంతో అవి అసలు స్వరూపాన్ని కోల్పోయాయి. ప్రాచీన శిల్ప సంపదను కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించడం కోసం వాటిని భద్రపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని పర్యాటకులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు