వీడని ఇంజినీర్ కిడ్నాప్ మిస్టరీ

1 Jul, 2016 22:13 IST|Sakshi
వీడని ఇంజినీర్ కిడ్నాప్ మిస్టరీ

పెదవాల్తేరు (విశాఖ): నైజీరియాలో కిడ్నాపైన విశాఖ ఇంజినీర్ మంగిపూడి సాయి శ్రీనివాస్ ఉదంతం ఇంకా మిస్టరీగానే వుంది. కిడ్నాప్‌నకు గురై మూడు రోజులైనా దుండగుల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సంప్రదింపులు జరపడంతో నైజీరియా ప్రభుత్వం స్పందించి శ్రీనివాస్ విడుదలకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సుష్మాస్వరాజ్, ఇంజినీర్ కుటుంబ సభ్యులకు శుక్రవారం స్వయంగా ఫోన్ చేసి తెలిపారు.

లోకల్ గ్యాంగ్‌లు కిడ్నాప్ చేసినట్టుగా భావిస్తున్నామని, ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదని, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ పనిచేస్తున్న డాంగోట్ గ్రూప్ కంపెనీ కూడా తన భర్త విడుదలకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఇంజినీర్ భార్య లలిత కేంద్ర మంత్రికి తెలిపారు. నైజీరియాలో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు మూడు రోజుల కిందట అపహరణకు గురైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు