అశ్లీలం తగ్గి, వెటకారం పెరుగుతోంది

24 Nov, 2015 08:33 IST|Sakshi
అశ్లీలం తగ్గి, వెటకారం పెరుగుతోంది

రాజమండ్రి కల్చరల్: నేటి సినిమాల్లో అశ్లీలం తగ్గుముఖం పట్టి వెటకారంతో కూడిన హాస్యం పెరుగుతోందని ప్రముఖ హాస్యనటుడు జూనియర్ రేలంగి అన్నారు. రెయిన్‌బో మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఆకలిరాజ్యం’ షూటింగ్ నిమిత్తం రాజమండ్రి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నేటి సినిమాల ధోరణులపై ఆయన ఏమన్నారంటే.. ‘నేటి సినిమాల్లో కమెడియన్ ఉండకపోవచ్చు. కానీ కామెడీ తప్పనిసరి. చాలా సినిమాల్లో హీరోలే కామెడీ చేస్తున్నారు. బాపు, జంధ్యాల, ఇ.వి.వి.సత్యనారాయణలతో పూర్తిస్థాయి హాస్య చిత్రాలకు బ్రేక్ పడ్డా ఇది తాత్కాలికమే. గతంలో సినిమా కథలో అంతర్భాగంగా హాస్యం ఉండేది. ఇప్పుడు కాలానుగుణంగా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా మార్పు వచ్చింది.
 
 ఈ మార్పు శాశ్వతంగా ఉండిపోదు. పాత సినిమాల్లో కమెడియన్లు హీరోలను గండాలనుంచి రక్షించేవారు. ఉదాహరణకు ‘భార్యాభర్తలు’లో, అక్కినేని హత్యానేరంపై అరెస్టయితే, రేలంగి కోర్టులో వాదించి, నిర్దోషి అని నిరూపిస్తాడు. ‘బందిపోటు’లో ఎన్టీఆర్ విలన్లకు చిక్కితే రేలంగి విడిపిస్తాడు. ఇప్పుడూ అలాంటి సందర్భాలు ఒకటీ అరా చే(చూ)స్తున్నాం. మాది జిల్లాలోని రాజోలు మండలం కడలి. బీకాం, బీఎల్ చదివాను. అసలు పేరు కాశీభట్ల సత్యప్రసాదరావు. మహానటుడు రేలంగి ఛాయలు ఉన్నందుకు నన్ను జూనియర్ రేలంగి అంటున్నారు. ఇప్పటి వరకు 400 సినిమాల్లో నటించాను. ఇప్పుడున్న సీనియర్ హాస్యనటులందరితో నాకు వ్యక్తిగత ంగా మంచి అనుబంధం ఉంది. నచ్చిన పాత్రకోసం నా నిరీక్షణకు ఇంకా తెరపడలేదు’ అన్నారు.
 

మరిన్ని వార్తలు