నర్సరీ పరిశీలన

22 Aug, 2016 17:26 IST|Sakshi

రాయికోడ్‌: మండలంలోని రాయిపల్లి గ్రామ ఈజీఎస్‌ నర్సరీని ఉపాధి హామీ పథకం ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ విష్ణువర్ధన్‌ సోమవారం పరిశీలించారు. నర్సరీల్లో పాడైన మొక్కల స్థానంలో నిమ్మ, కరివేపాకు విత్తనాలను నాటి మొక్కలుగా పెంచాలన్నారు. మెరుగైన పోషణ పద్ధతులు పాటిస్తే నిమ్మ, కరివేపాకు మొక్కలు 25 రోజుల్లో నాటేందుకు ఎదుగుతాయన్నారు.

ప్రతి రోజూ నర్సరీల్లోని మొక్కలను పరిశీలిస్తూ బాధ్యతగా పెంచాలని నిర్వాహకులకు సూచించారు. మొక్కల పెంపకంపై కూలీలకు పలు సూచనలు చేశారు. రాయిపల్లి నర్సరీలో మొత్తం లక్ష మొక్కలను పెంచాల్సి ఉండగా ఇప్పటి వరకు 70 వేల మొక్కలను పెంచి పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం టేకు, చింత తదితర మొక్కలు పెరుగుతున్నాయన్నారు.

మరికొన్ని మొక్కలను పెంచడానికి కవర్లలో మట్టిని నింపి సిద్ధం చేశారన్నారు. అనంతరం కర్చల్‌-ఇందూర్‌ ప్రధాన రహదారికి ఇరుపక్కల నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలకు నీళ్లు పోస్తున్న కూలీలకు సూచనలు చేశారు. కార్యక్రమంలో టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సాయన్న, ధనుంజయ్‌, కూలీలు పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణకు చర్యలు
గత రెండు వారాలుగా మండలంలో వర్షాలు ముఖం చాటేయడంతో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టారు. సోమవారం జంమ్గి గ్రామంలో పలువురు రైతులు తమ పొలం గట్లపై నాటిన టేకు మొక్కలకు నీళ్లు పట్టారు. నాటిన టేకు మొక్కల సంరక్షణ కోసం ఒక్కో మొక్కకు నెలకు రూ.5 చొప్పున ఈజీఎస్‌ ద్వారా అందిస్తామని అధికారులు తెలిపారు. రెండు సంవత్సరాల వరకు మొక్కల పోషణ ఖర్చులు ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు