ధరలేక దిగాలు

3 Jan, 2017 22:35 IST|Sakshi
ధరలేక దిగాలు

భారీగా నష్టపోతామంటూ ఉల్లి రైతు ఆందోళన
పెట్టుబడులు కూడా రాని వైనం


తాడేపల్లి రూరల్‌ : నారు వేసే సమయంలో రైతులను ఊరించిన ఉల్లి.. పంట చేతికొచ్చే సమయంలో కంటనీరు తెప్పిస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం కనీసం పెట్టుబడులైనా వచ్చే సూచనలు కనబడడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఈ ఏడాది దాదాపు 1300 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. గతేడాది పంట లాభసాటిగా ఉండడంతో ఈ ఏడాది  రైతులు ఉత్సాహంతో సాగుచేశారు. అయితే   నాట్లు వేసే సమయంలో కేజీ ఉల్లిపాయలు రూ. 20 ఉండగా, ప్రస్తుతం రూ.7 కు చేరింది. దీంతో రైతులు దిగాలు పడుతున్నారు.   పంట దిగుబడి వస్తే ఎకరాకు రూ. 30 వేలు, దిగుబడి తగ్గితే రూ. 60 వేల చొప్పున నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పెట్టుబడి ఇలా...
జిల్లాలు దాటి నారు కొనుగోలు చేయడంతో నారు ఖర్చు ఒక్కటే రూ. 20 వేలు అవుతోంది. నారు కొనుగోలు చేసిన తరువాత దుక్కికి ఎకరాకు రూ. 1800, సాళ్లు చేయడానికి ఇద్దరు కూలీలకు రూ. 1000, నాటు వేయడానికి 26 మందికి రూ. 5200, దమ్ము చేయడానికి రూ. 2500, ఎరువులు, పురుగు మందులకు రూ. 20 వేలు, కలుపు తీయడానికి (4సార్లు) రూ. 5600, నీటి తడి పెట్టేందుకు రూ 2500, కోత కోసేందుకు రూ. 7600, మోత కూలీకి రూ. 2500 మొత్తం రూ. 68,700 అవుతోంది. ఇదిగాక రాజధాని పుణ్యమా అంటూ కౌలు అమాంతంగా పెరిగి  రూ. 40 వేలకు చేరింది. ఉల్లి పంట ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. కౌలుతో కలిపి మొత్తం రూ. 88,700 పెట్టుబడి అవుతోంది. బాగా ఊరిన పంట పొలాల్లో ఉల్లి దిగుబడి 180 బస్తాలు కాగా, ఊరని పొలాలలో 90 బస్తాలు మాత్రమే అయ్యాయి. కేజి రూ. 7 చొప్పున 40 కేజీల బస్తా రూ. 280కు అమ్ముడు పోతుండగా, 180 బస్తాలకు రూ. 50,400 వస్తోంది. నష్టం రూ. 38, 300 వస్తోందని రైతులు లెక్కలు చెబుతున్నారు. అలాగే ఉల్లి గడ్డ ఊరని పొలాల్లో రాబడి రూ. 25,200 కాగా, నష్టం రూ. 63,500 వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు
నియోజక వర్గంలో పండిన ఉల్లి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు చెన్నై, బెంగుళూరు, భువనేశ్వర్‌లకు ఎగుమతి అవుతుంది. ఎంత ప్రసిద్ధి చెందినా రైతుకి మాత్రం ప్రతిఫలం అందడం లేదని వాపోతున్నారు. అంతేకాక   తాతలు తండ్రుల నుంచి ఉల్లి పండిస్తున్నా  వ్యవసాయ అధికారులు నారుమళ్లు పెంపకం గురించి, వాటి పోషణ గురించి   వివరించకపోవడం వల్ల భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రేటు చూస్తే భయమేస్తోంది
ఎకరంన్నరలో ఉల్లి సాగు చేశాను. రేటు చూసి భయమేస్తోంది. చేతికి వచ్చిన పంటను భూమిలో నుంచి పీకి మార్కెట్‌కు తరలిస్తే ఎంత నష్టం వస్తుందో అర్థం కావడం లేదు. పంట పీకాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. మరో పది రోజుల్లో పీకకపోతే భూమిలోనే ఉల్లి గడ్డలు కుళ్లిపోతాయి. రేటు పెరుగుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నాను.   
 – తమ్మా నాగిరెడ్డి, ఉండవల్లి

మరిన్ని వార్తలు