వరద గోదారిలో పర్ణశాల

4 Aug, 2016 23:01 IST|Sakshi
నీటిలోనే ఉన్న మూర్చరిల్లిన సీతమ్మ విగ్రహం

దుమ్ముగూడెం :
    మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగుతోంది. పర్ణశాల పరిసరాలను వరదనీరు కమ్మేసింది. అంత్యపుష్కరాలకు వచ్చిన భక్తులకు ఆటంకం ఏర్పడింది. స్నానఘట్టాల వద్ద ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయంభయంగా స్నానమాచరించిన భక్తులు రామయ్యను దర్శించుకున్నారు. సీతవాగు ఉధృతితో సీతమ్మ విగ్రహం సగభాగం నీటిలోనే ఉంది. సీతవాగు పరిసరాలను దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పర్ణశాలలోని అపురూప దృశ్యాలను చూడలేకపోయామని నిరాశతో వెనుదిరిగారు. పుష్కరాల్లో భాగంగా వేదపండితులు గోదావరి తల్లికి పూజలు చేశారు. సాయంత్రం 6 నుంచి 6.15 గంటల వరకు నదీ హారతి ఇచ్చారు.

మరిన్ని వార్తలు