పురపాలకా..ఇదేమి మెలిక!

24 Jun, 2017 00:03 IST|Sakshi
పురపాలకా..ఇదేమి మెలిక!

- అధిష్టానం ఆదేశం బేఖాతర్‌
- ఉత్కంఠను రేపుతున్న పుట్టపర్తి చైర్మన్‌ రాజీనామా వ్యవహారం
- హామీలు నెరవేరిస్తే పదవికి రాజీనామా : మున్సిపల్‌ చైర్మన్‌ పీసీ గంగన్న
- హామీలకు పదవికి మెలికపెడుతున్న వైనం


పుట్టపర్తి టౌన్‌ : ముఖ్యమంత్రి ఆదేశంతో మున్సిపల్‌ చైర్మన్‌ మార్పు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందని ఆశించిన టీడీపీ శ్రేణులు, పుట్టపర్తి ప్రజలకు తాజా పరిణామాలతో మరింత ఉత్కంఠ పెరిగింది. మున్సిపల్‌ చైర్మన్‌గా పీసీ గంగన్న రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో తక్షణమే రాజీనామా చేసి, ఇతరులకు అవకాశం కల్పించాలని ఏకంగా పార్టీ అధిష్టానం ఆదేశించినా ఆయన మాత్రం బెట్టువీడడంలేదు. అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తానని ఓ వైపు చెప్తూనే.. మరో వైపు గత ఎన్నికలప్పుడు పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చిన హామీలను ‘పల్లె’ నెరవేరిస్తే రాజీనామా చేస్తానంటూ మెలిక పెడుతూ పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేందుకు సిద్ధమయ్యారు.  

    ఈనెల 9న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పుట్టపర్తి ఎయిర్‌పోర్టులోకి మున్సిపల్‌ చైర్మన్‌ హోదాలో పీసీ గంగన్నను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసు అధికారులపై నోరుపారేసుకున్నారు. జిల్లాలో అలజడి రేగింది. గంగన్న దురుసు వైఖరితో పోలీసు శాఖతోపాటు, రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది టీడీపీకి కూడా ఇబ్బందిగా మారింది. దీంతో గంగన్నపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు.

రాజీకాని ‘పంచాయితీ’ :
    మాజీ మంత్రి ‘పల్లె’తోపాటు, పుట్టపర్తి టీడీపీ నాయకులు చైర్మన్‌ పదవి కోసం రెండున్నరేళ్ల ఒప్పందాన్ని జిల్లా పెద్దల వద్దకు తీసుకువచ్చారు. జిల్లా పెద్దల పంచాయితీలోనూ గంగన్న రాజీనామాకు ఆంగీకరించకపోవడంతో, పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. తలనొప్పిగా మారిన జిల్లాలోని పార్టీ వ్యవహారాలపై రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలోనూ పుట్టపర్తి చైర్మన్‌ రాజీనామా వ్యవహారం వాడీవేడిగా సాగింది. తక్షణమే రాజీనామా చేయించి ఇతరులకు అవకాశం కల్పించాలని టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి దేవినేని, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

సాయి ఆరామంలో ‘కొత్తనాటకం’ :
    ఇంతా జరుగుతున్నా... పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి విషయంలో జిల్లాలో ఉత్కంఠ ఉన్నా.. పార్టీ పెద్దలకు షాకిస్తూ శుక్రవారం తన అనుచరులతో కలసి గంగన్న సాయిఆరామంలో సమావేశం నిర్వహించారు.  కొత్త నాటకానికి తెరలేపారు. గత ఎన్నికల సమయంలో ‘పల్లె’ రఘునాథరెడ్డి, పుడా, పుట్టపర్తి నగర పంచాయతీ వైస్‌ చైర్మన్, పుట్టపర్తి ఎంపీపీ, సహకార సంఘం అధ్యక్ష పదవుల విషయంలో ఇచ్చిన హామీలను తొలుత నెరవేర్చాలని, తరువాత పార్టీ పెద్దలు ఆదేశాల మేరకు వెంటనే తను రాజీనామా చేస్తానంటూ మెలిక పెట్టారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు చైర్మన్‌ పదవికి గంగన్న రాజీనామా చేసే పరిస్థితిలేదని చర్చించుకున్నారు.  

డిమాండ్లు నెరవేరిస్తే రాజీనామా చేస్తా : పీసీ గంగన్న
గత ఎన్నికల సమయంలో ‘పల్లె రఘునాథరెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న తమ డిమాండ్‌ను నెరవేరిస్తే, అధిష్టానం ఆదేశం మేరకు తాను మున్సిపల్‌ చైర్మన్‌పదవికి రాజీనామా చేస్తానని పీసీ గంగన్న తేల్చి చెప్పారు. శుక్రవారం స్థానిక సాయిఆరామంలో తన అనుచరులతో కలసి ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం తనను చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించిన మాట వాస్తవమేనన్నారు. చైర్మన్‌ ఒప్పందం కంటే ముందు చేసుకున్న పలు ఒప్పందాలను, ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.

పుట్టపర్తి సహకార సంఘం అధ్యక్ష పదవి ఒప్పందం మేరకు రెండున్నరేళ్లకు ఓబులేసు రాజీనామా చేయగా, ముమ్మనేని వెంకటరాముడు అధ్యక్ష పదవి చేపట్టాడని, అయితే అధికార పార్టీ నాయకులే సమావేశాలు జరగకుండా అడ్డుకుని పాలకమండలి రద్దేయ్యే విధంగా చేశారన్నారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు.పుట్టపర్తి ఎంపీపీ పదవి ఒప్పందం మేరకు అమలు కాలేదన్నారు. ఈ విషయాలనన్నింటినీ ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి దృష్టికి తీసుకుపోతామని, వారి నిర్ణయం మేరకు తాను చైర్మన్‌ పదవిపై నిర్ణయం తీసుకుంటానన్నారు.  కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ  చైర్మన్‌ జయరాంనాయుడు, కౌన్సిలర్‌ సుభాషిణి, నాయకులు కోనంకి చంద్రశేఖర్, వెంకటరాముడు, ఊరువాకిలి సురేష్‌నాయుడు, ముత్యాల మురళీ, గుట్లపల్లి గంగాద్రి, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు ముమ్మనేని వెంకటరామడు, బీవీప్రసాద్, సత్యనారాయణ, పుట్లగంగాద్రి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు