నోరెళ్లబెట్టిన చెరువులు

2 Aug, 2016 00:19 IST|Sakshi
  • జిల్లాలో నిండిన చెరువులు పదిశాతమే
  • మహబూబాబాద్, వరంగల్‌ డివిజన్ల వెనుకంజ
  • ముందంజలో ములుగు
  • మైనర్‌ ఇరిగేషన్‌ విభాగం  నివేదికలో వెల్లడి
  • సాక్షి, హన్మకొండ : ఓ వైపు వర్షాలు కురుస్తూనే ఉన్నా.. జిల్లాలోని చెరువులు మాత్రం ఆశాజనకమైన స్థాయిలో నిండలేదు. మెుత్తం చెరువుల్లో కేవలం 10 శాతం మాత్రమే పూర్తిగా నిండాయనే విషయాన్ని మైనర్‌ ఇరిగేషన్‌ విభాగం తాజా నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈనెలలో కురిసే వర్షాలపైనే చెరువులు నిండటం అనేది ఆధారపడి ఉంది. వర్షాలు బాగా కురిస్తే ఖరీఫ్‌లో పంటల సాగుకు ఢోకా ఉండదని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టులన్నీ సగం వరకే పూర్తి కావడంతో రైతులు ప్రధానంగా చెరువులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.
    మత్తడిపోసినవి 77
    మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 5,550 చెరువులు ఉన్నాయి. వీటిలో పూర్తిగా నిండి, మత్తడి పోసిన చెరువులు కేవలం 560 మాత్రమే. ఇందులో కేవలం వంద ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 483. జిల్లావ్యాప్తంగా వంద ఎకరాలకు మించిన ఆయకట్టు కలిగిన చెరువులు 802 ఉండగా, వీటిలో 77 చెరువులు మాత్రమే నిండి, మత్తడిపోశాయి. కేవలం 25 శాతం నీరు చేరిన చెరువుల సంఖ్య 2864, 25 శాతం నుంచి 75 శాతం మధ్య నిండిన చెరువుల సంఖ్య 365గా ఉంది.
    డివిజన్లవారీగా..
    ములుగు డివిజన్‌లోని చెరువుల్లో నీరు అధికంగా చేరగా, మహబూబాబాద్‌ డివిజన్‌లోని చెరువుల్లో నామమాత్రంగానే నీరు చేరినట్లు మైనర్‌ ఇరిగేషన్‌ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ములుగు డివిజన్‌లో 1859 చెరువులు ఉండగా, రికార్డు స్థాయిలో 534 చెరువులు పూర్తిగా నిండాయి. మానుకోట డివిజన్‌ పరిధిలో చిన్నా, పెద్దా కలిపి 1470 చెరువులు ఉండగా, ఒక్కటి కూడా నిండలేదు. అయితే 50 శాతం(సగం) కంటే ఎక్కువగా నిండిన చెరువులు 302 ఉన్నాయి. వరంగల్‌ డివిజన్‌లోని చెరువులు సైతం వాన నీటి కోసం నోరెళ్లబెట్టి ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ వంద ఎకరాల్లోపు ఆయకట్టు కలిగిన నాలుగు చెరువులు నిం డటం గమనార్హం. ఏటూరునాగారం డివిజన్‌లో మొత్తం 1071 చెరువులు ఉండగా 22 నిండగా, మరో 135 చెరువులు 80 శాతానికిపైగా నిండాయి.
     
    డివిజన్‌ చెరువులు నిండినవి సగం లోపు నిండినవి
    వరంగల్‌ 1,148 4 1,115
    మహబూబాబాద్‌ 1,470 0 1,168
    ములుగు 1,859 534 724
    ఏటూరునాగారం 1,075 22 538 
మరిన్ని వార్తలు