ప్రతిపాదనలు సిద్ధం చేయండి

10 Jun, 2017 00:12 IST|Sakshi
- హైవేల అభివృద్ధిపై కలెక్టర్‌
- సంబంధిత అధికారులతో సమీక్ష
 
 కర్నూలు(అగ్రికల్చర్‌):  కర్నూలు నుంచి దోర్నాల, అనంతపురం నుంచి గిద్దలూరు వరకు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. ఇందుకు సంబంధించి కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం హైవే అథారిటీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల వరకు ఎన్‌హెచ్‌-340సీ, అనంతపురం నుంచి కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి, గోస్పాడు, శిరువెల్ల, మహానంది, నంద్యాల మీదుగా గిద్దలూరు వరకు ఎన్‌హెచ్‌- 544డీ నెంబరుతో నాలుగు లైన్‌ల రోడ్డు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలకు తగిన మార్పులు చేర్పులు చేయాలన్నారు. బైపాస్‌ రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు నుంచి గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు, ఆత్మకూరుకు బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
 
అనంతపురం నుంచి గిద్దలూరు, కర్నూలు నుంచి దోర్నాల వరకు ఎన్‌హెచ్‌ రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములపై గతంలో ఉన్న ప్రతిపాదనలనే పరిశీలించాలని సూచించారు. అలైన్‌మెంటు ప్రతిపాదనల్లో విద్యుత్‌ లైన్‌లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ పైప్‌లైన్‌లను చేర్చాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, నేషనల్‌ హైవే పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరిబాబు, నంద్యాల, ఆత్మకూరు డీఎఫ్‌ఓలు శివప్రసాద్, సెల్వమ్, నంద్యాల ఆర్‌డీఓ రాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు