బయటపడిన వ్యాపారుల సిండికేట్‌

17 Sep, 2016 23:11 IST|Sakshi
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన పెసలు
  • నెలకు పైగా రైతులను మోసం చేసిన వైనం 
  • క్వింటాకు సగటున రూ.1,000 నష్టపోయిన రైతులు 
  • ప్రభుత్వ కొనుగోలుతో సమాంతర ధర పెడుతున్న వ్యాపారులు
  • ఖమ్మం వ్యవసాయం : ప్రభుత్వం పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడటంతో వ్యాపారుల అసలు రంగు బయటపడింది. పంట ఉత్పత్తికి డిమాండ్‌ ఉన్నా వ్యాపారులు కనీస మద్దతు ధర పెట్టకుండా తక్కువ ధరకు సరుకు కొనుగోలు చేశారు. మద్దతు ధర కన్నా వ్యాపారులు రూ.1,000 పైగా తక్కువ ధరకు సరుకును కొనుగోలు చేశారు.  దీంతో ప్రభుత్వం పెసల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వారం కిందట నాఫెడ్‌ నిధులతో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 5,962 హెక్టార్లు కాగా 27,310 హెక్టార్లలో, కంది సాధారణ సాగు విస్తీర్ణం 2,964 హెక్టార్లు కాగా, 9,420 హెక్టార్లలో పంటలను వేశారు. పెసర సాగు విస్తీర్ణం జిల్లాలో నాలుగున్నర రెట్లు పెరిగింది. ఆగస్టు రెండోవారం నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పెసల కొనుగోలు మొదలైంది. 
    తీవ్రంగా నష్టపోయిన రైతులు 
    కొత్త పెసల కొనుగోళ్లు మొదలైన సమయంలో రూ.7 వేలకు పైగా ఉన్న పెసల ధర ఒక్కసారిగా కుప్పకూలింది. నాణ్యత పేరిట రూ.4 వేల నుంచి రూ.4,500కు కొనుగోళ్లు చేయటం ఆరంభించారు. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు వరంగల్, నల్లగొండల్లో కూడా పంట సాగు ఎక్కువగా ఉండి పంట ఉత్పత్తి అధికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి వస్తుండటంతో వ్యాపారులు సిండికేటై అమాంతం ధరను తగ్గించారు. సరుకు నాణ్యతను బట్టి రూ. 3,500 నుంచి రూ.4,400 వరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.5,225 కాగా రూ.వెయ్యికి తక్కువ ధరకు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యాపారులు సిండికేటై రైతులను నిలువునా దోచుకున్నారు. వ్యవసాయ మార్కెట్లలోనే గాక గ్రామాల్లో కూడా వ్యాపారులు తక్కువ ధరలకు పంట ఉత్పత్తిని కొనుగోలు చేశారు. 
    1,400 క్వింటాళ్లు కొనుగోలు 
    ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏడాది కొత్త పెసల సీజన్‌ ఆరంభం నుంచి ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు వరకు సుమారు 1,400 క్వింటాళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. దీనిని పరిగణలోకి తీసుకుంటే రూ.14 లక్షల మేర రైతులు నష్టపోయి ఉంటారని అంచనా. కాగా, ప్రభుత్వ పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో వ్యాపారులు ధర పెంచారు. క్వింటా పెసలను రూ.4,800 నుంచి రూ.5,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యాపారుల అసలు రంగు బయటపడింది.
    కొనుగోలు కేంద్రంతోనే పోటీ ధర:
    వనకంచి పెదవెంకయ్య రైతు, మంచుకొండ 
    ప్రభుత్వం పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడటంతోనే వ్యాపారులు ధర పెంచారు. లేదంటే క్వింటా పెసలను రూ.4 వేలకు మించి కొనుగోలు చేయలేదు. డబ్బు అవసరం ఉండి వ్యాపారులకు రూ.4,800 విక్రయించా. 
    ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా
    గొల్లపూడి నాగేశ్వరరావు, రైతు, తాళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం
    ధర తక్కువగా ఉండటంతో సరుకును అమ్మలేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి క్వింటాకు రూ.5,225 ధర కల్పించటంతో ఆ ధరకు విక్రయించా. వ్యాపారులు క్వింటాకు రూ.4,000కు మించి అడగ లేదు. కొనుగోలు కేంద్రంతో మద్దతు ధర వచ్చింది.
     
     
మరిన్ని వార్తలు