రాజగోపురం పనులు వేగవంతం

30 Aug, 2016 00:16 IST|Sakshi
నిర్మాణంలో ఉన్న గాలిగోపురం
 
శ్రీకాళహస్తి :  శ్రీకాళహస్తి ఆలయ రాజగోపుర పునర్మిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే 112 అడగుల ఎత్తు వరకు పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో జరిగే కుంభాభిషేకం లోపు పూర్తి చేసి నాటి రాజసాన్ని నిలిపేందుకు దేవస్థానం కసరత్తు చేస్తుండగా,భక్తులను అలనాటి జ్ఞాపకాలలోకి నెట్టేస్తోంది. శ్రీకృష్ణదేవరాయులు గజపతులపై విజయం సాధించిన సందర్భంగా 1516లో ఆలయం పక్కనే 120 అడుగుల రాజగోపురాన్ని నిర్మించారు. 2010లో గోపురం కుప్పకూలింది. గోపురాన్ని ఉచితంగా నిర్మించేందుకు నవయుగ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ముందుకు వచ్చింది. 2010, ఆగస్టు 29న అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, స్థల సేకరణలో అడ్డంకులు రావడంతో పనుల్లో తీవ్ర ఆలస్యం చోటు చేసుకుంది. అవాంతరాలను అధిగమించి ఏడాదిగా పనులను దేవస్థానం వేగవంతం చేసింది.  140 అడుగుల గోపుర నిర్మాణంలో ప్రస్తుతం 112 అడుగులు పూర్తి అయింది. ఫిబ్రవరి 8వ తేదీన జరిగే ఆలయ మహాకుంభాభిషేకం లోపే పనులు పూర్తి చేసేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటోంది.
 
 
మరిన్ని వార్తలు