కొత్త..కొత్తగా!

13 Sep, 2016 23:58 IST|Sakshi
వనపర్తిలోని పీఆర్‌ అతిథిగహం
వనపర్తి టౌన్‌: కొత్త జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో జిల్లా కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసగహాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా పాలనాయంత్రాంగం కోసం కలెక్టర్, ఎస్పీల నివాసగహాల ఎంపిక ప్రక్రియ చకచకా సాగుతోంది. ఈ విషయమై పట్టణంలోని పలు కార్యాలయాలను పరిశీలించిన అధికారులు చివరకు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం కోసం పంచాయతీరాజ్‌ అతిథిగహాన్ని, ఎస్పీ క్యాంప్‌ కార్యాలయాన్ని ఇరిగేషన్‌ బోర్డు(ఐబీ) అతిథిగహాన్ని దాదాపుగా ఖరారుచేశారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు కూడా ధ్రువీకరిస్తున్నారు. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్‌ ఇదివరకే పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయా శాఖల ముఖ్య అధికారుల నివాసగహాలు సిద్ధమవుతున్నాయి.
    కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదులు అందజేసేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాంపు కార్యాలయాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ఈ రెండు భవనాలను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. విజయదశమి నాటికీ కొత్త కలెక్టర్, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆ లోపు అన్ని ఏర్పాట్లను చక్కదిద్దుతున్నారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం కోసం పంచాయతీరాజ్‌ అతిథిగహం రెండు అంతస్తుల్లో రూ.40లక్షలతో ఇటీవల నిర్మాణం పూర్తిచేశారు. మిగిలిపోయిన కొద్దిపాటి పనులకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ రెండు భవనాలకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ సమకూర్చుతోంది. కొత్త జిల్లాలకు ఏర్పాట్లు చకచకా సాగిపోతుండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. 
 
మరిన్ని వార్తలు