వట్టిపల్లిలో రియల్టర్ల భూ దందా

13 Sep, 2016 20:40 IST|Sakshi
కామునికుంట వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు
  • కుంట కబ్జాకు యత్నం.. అడ్డుకున్న గ్రామస్తులు
  • జగదేవ్‌పూర్‌: కొందరు రియల్టర్లు భూ దందాకు తెరలేపారు. కుంటను కబ్జా చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని వట్టిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న 20 ఎకరాల భూమిని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులకు విక్రయించారు.

    అయితే గ్రామస్తులు తన భూమి పక్కనే కామునికుంట ఉంది. కొన్నేళ్లుగా గ్రామస్తులు కుంటలోనే బతుకమ్మలను వేస్తున్నామని అయితే కుంటను విడిచి మిగతా భూమిని అమ్ముకోవాలని సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే కొన్నవారు కుంట లేదు శికం లేదు అంతా తమదేనని ఇరవై రోజుల నుంచి చదును చేస్తున్నట్లు చెప్పారు.

    సోమవారం కొంత మంది గ్రామస్తులు కలిసి  తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తమ గ్రామంలో కామునికుంటను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వట్టిపల్లి గ్రామానికి  చెందిన ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలించారు. కుంట సర్వే నంబర్‌ 276, 278 లో ఉందని డీప్యూటీ తహసీల్దార్‌, వీఆర్‌ఓలు తెలిపారు.

    దీంతో మంగళవారం గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కామునికుంట దగ్గరకు వెళ్లి భూమిని పరిశీలించారు. ముందే తెలుసుకున్న రియల్టర్లు పనులను ఆపేశారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ కుంటను కబ్జాను చేస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కుంట శికం ఐదెకరాల వరకు ఉంటుందని తెలిపారు.

    బతుకమ్మలను వేసేటోళ్లం..
    ఎన్నో ఏళ్ల నుంచి కామునికుంటలో బతుకమ్మలు వేసుకుంటూ వస్తున్నాం. కుంట ఇన్నాళ్లు గ్రామానికి చెందిన  ఓ వ్యక్తి  భూమిలోనే ఉందని అనుకున్నాం. అయన కూడా ఎప్పుడు బతుకమ్మలను అడ్డుకోలేదు. తాను అమ్ముకున్న తర్వాత కొన్నవారు భూమితో పాటు కుంటను కూడా తవ్వేస్తున్నారు. కుంటను తవ్వొద్దని చెప్పినా వినలేదు. అధికారులను కలిసితే అసలు విషయం తెలిసింది. కామునికుంట ప్రభుత్వ భూమిలో ఉందని, రికార్డులో కూడా చుశాం. - గ్రామస్తుడు, నర్సయ్య

    అధికారులు హద్దులు పాతాలి
    గ్రామంలో కామునికుంట కబ్జాకు గురైంది. మిషన్‌కాకతీయ నిధులు వచ్చినా పనులు జరగనివ్వలేదు. కామునికుంట గ్రామానికే చెందాలి. లేకుంటే గ్రామస్తులంతా కలిసి ఆందోళన చేస్తాం. కొన్నవారిని అడిగితే ఏమి చేసుకుంటరో చేసుకోండని అంటున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు పాతాలి. - గ్రామస్తుడు, సత్యనారాయణ

మరిన్ని వార్తలు