మట్టి హాంఫట్‌!

26 Feb, 2017 00:13 IST|Sakshi
మట్టి హాంఫట్‌!

నీరు–చెట్టు పనుల పేరుతో దోపిడీ
ప్రతిరోజూ 400 ట్రిప్పులు అమ్మకం
నాలుగు మాసాలుగా ఇదే తంతు
చెరువునే చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు  


నీరు–చెట్టు పనులు అధికార పార్టీ నాయకులకు కల్పతరువుగా మారాయి. వర్క్‌ అలాట్‌మెంట్‌ కాకపోయినా ఈ పనుల పేరు చెప్పి చెరువులు, వంకలు, వాగుల్లోని మట్టిని కొల్ల గొడుతున్నారు. ట్రిప్పునకు రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముకుంటూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కడప చుట్టుపక్కల 4 మాసాలుగా ఈ దందా సాగుతున్నా ఇరిగేషన్‌ అధికారులుగానీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు తొంగి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కడప కార్పొరేషన్‌:
నీరు–చెట్టు పనులు కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పనులు చేపట్టే విషయంలో తెలుగు తమ్ముళ్లు ధనార్జనే ధ్యేయంగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. నిబంధలనల ప్రకారం నీరు–చెట్టు కింద పూడిపోయిన వంకలు, వాగులు, చెరువుల్లో పూడిక తీత, చెరువు నుంచి పొలాల్లోకి వున్న కాలువలను బాగుచేయడం వంటి పనులు చేయాలి. కానీ అవేవీ జిల్లాలో అమలు కావడం లేదు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని పుట్లంపల్లి చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉంది. పంటలు కోసిన తర్వాత ఈ మట్టిని పొలాల్లోకి తోలి భూసారాన్ని పెంచితే రైతులకు ఉపయోగముంటుంది. అలాకాని పక్షంలో చెరువు కట్టను బలోపేతం చేసేందుకు ఈ మట్టిని వినియోగించాలి. అంతిమంగా ఈ పనుల వల్ల రైతులకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.

అయితే ఈ పథకం అమలు మాత్రం తమ్ముళ్లకు ఆర్జించిపెట్టడమే పరమావధిగా ముందుకు సాగుతోంది. పుట్లపల్లి చెరువులో సాగుతున్న నీరు–చెట్టు పనులే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో నాలుగు మాసాలుగా ఈ మట్టి దందా సాగుతోంది. కేవలం రూ.10 లక్షల వర్క్‌ను ఇలా నెలల తరబడి చేస్తూ మట్టిని కొల్లగొడుతున్నట్లు సమచారం. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజుకు దాదాపు 400 ట్రిప్పుల వరకూ తోలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన 4 నెలలకు రూ.2కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు తెలుస్తోంది. వర్క్‌ అలాట్‌మెంట్‌ అయిన చోట కాకుండా చెరువు మధ్యలోని మట్టిని జేసీబీతో తోడుతూ ప్రయివేటు సంస్థలకు, ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

అసలు కంటే కొసరే ఎక్కువ
అసలు కంటే కొసరే ఎక్కువన్నట్లు ఇక్కడ వర్క్‌ మంజూరైంది రూ.10లక్షలైతే, మట్టిని అమ్ముకోవడం ద్వారా ఇరవై రెట్లు అధికంగా ఆర్జించినట్లు సమాచారం. చెరువులో, కాలువల్లో ఉన్న నల్లమట్టిని తీయాల్సి ఉండగా, సారవంతమైన ఎర్రమట్టిని తీస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షలతో చేపట్టిన ఈ పనులు నాలుగునెలల పాటు సుదీర్ఘ కాలం సాగుతుండటంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు సుమారు రూ.1.60లక్షల వరకూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. దీని వెనుక అధికారపార్టీ ముఖ్యనేత ఉండటం వల్లే యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్‌ శాఖలోని ఈఈ స్థాయి అధికారి దీనికి పూర్తి అండదండలు అందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కొత్త కలెక్టరేట్‌కు ఈ చెరువు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఈ దందాను అడ్డుకోలేని స్థితిలో ఉండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీరు–చెట్టు పేరు చెప్పి చెరువులో ఇష్టానుసారం గోతు లు తవ్వుతున్నారు. భవిష్యత్‌లో ఈ గోతు లు పెను అనర్థాలకు దారితీసే అస్కారం ఉందని పుట్లంపల్లె గ్రామస్తులు సైతం వాపోతున్నారు. గతంలో కూడా గుంతలున్నాయనే విషయం తెలియక ఈత సరదాతో పసిప్రాణాలు గాల్లో కలిసిన దాఖలాలున్నాయి. సమాజానికి ఎటుచూసినా అనర్థదాయకంగా మారనున్న ఈ వ్యవహారాన్ని తక్షణమే కట్టడి చేయాల్సి ఉంది.  

పరిశీలించి చర్యలు తీసుకుంటాం:
నీరు–చెట్టు పనులకు వర్క్‌ మంజూరైంది. మొత్తం రూ.5లక్షలు విలువైన చేయాల్సి ఉంది. అయితే చెరువులోని మట్టిని అమ్ముకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలిస్తాం. మట్టి అమ్ముకున్నట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటాం. మురళీకృష్ణ, డీఈ, మైనర్‌ ఇరిగేషన్‌శాఖ కడప

మరిన్ని వార్తలు