వైఎస్‌ జగన్‌కు ఆత్మీయ స్వాగతం

29 Nov, 2016 00:08 IST|Sakshi
వైఎస్‌ జగన్‌కు ఆత్మీయ స్వాగతం

కదిరి : బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం అనంతపురం జిల్లా పొలిమేరల్లో అడుగుపెట్టగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. కొడికొండ చెక్‌పోస్టు వద్ద వైఎస్సార్‌సీపీ చిలమత్తూరు మండల కన్వీనర్‌ సదాశివరెడ్డి ఆయనను కలిసి జిల్లా కరువు పరిస్థితులను వివరించారు. ఈసారి ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశనగ పూర్తిగా ఎండిపోయిందని, కనీసం పెట్టుబడులు కూడా చేతికందలేదని చెప్పారు. ప్రభుత్వం గత ఏడాది ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదని ఆయన దృష్టికి తెచ్చారు. ఆ వివరాలన్నీ పక్కాగా పంపాలని చెప్పిన జగన్‌ అక్కడ సెలవు తీసుకుని గోరంట్ల చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనతో కరచాలం చేయడానికి అమితాసక్తి చూపించారు. వారందరికీ అభివాదం చేస్తూ జగన్‌ ముందుకు సాగిపోయారు. ఓడి చెరువు చేరుకోగానే ముందుగానే అక్కడికి చేరుకున్న జనం ‘జై జగన్‌.. జై జై జగన్‌’ అంటూ గట్టిగా అరిచారు. వారిని ఆప్యాయంగా చూస్తూ అభివాదం చేశారు. తర్వాత కదిరి పట్టణంలోని వేమారెడ్డి కూడలికి చేరుకోగానే జనమంతా ఒక్కసారిగా ‘కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌ జిందాబాద్‌’ అంటూ నినదిస్తూ ఈలలు, కేకలు వేశారు. అభిమానులతో కరచాలనం చేసిన జగన్‌ జనం ఎక్కువగా ఉండటంతో వాహనమెక్కి అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అభివాదం చేస్తూ నవ్వుతూ వారి వద్ద సెలవు తీసుకుని బయల్దేరారు. వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డిని తన వాహనంలో పులివెందుల వరకు తీసుకెళ్లారు. హర్తాళ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసుల చేత భగ్నం చేయించారని సిద్ధారెడ్డి జగన్‌కు తెలిపారు. 10 రోజులుగా ప్రజలు తమ ఖాతాల్లో ఉన్న డబ్బులు డ్రా చేసుకోవడానిక్కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏ బ్యాంకుకెళ్లినా డబ్బు లేదనే సమాధానమే ఎదురవుతోందన్నారు. ఈ సందర్భంగా హంద్రీ-నీవాపై ఆరా తీసిన జగన్‌ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలని సిద్ధారెడ్డికి సూచించారు.

మరిన్ని వార్తలు