సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు

3 Jan, 2017 23:58 IST|Sakshi
సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు

ఆదిలాబాద్‌ అర్బన్  : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జేఏసీ రాష్ట్ర నాయకుడు కొప్పిశెట్టి సురేష్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట కాంట్రాక్టు లెక్చరర్లు చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్న వారికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి అనేక విధాలుగా విన్నవించినా సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వ క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇంతవరకు రెగ్యులర్‌ చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని అన్నారు. ఒకేషనల్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. మహిళా అధ్యాపకులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, జిల్లా సగటు ఉత్తీర్ణత శాతాన్ని ఎత్తివేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సోమవారం దీక్షలో ప్రవీణ్‌కుమార్, రమేష్, వెంకటేష్, సూర్యకాంత్, ఉపేందర్‌రెడ్డి, నామ్‌దేవ్, లక్ష్మణ్, హరి, ఆశోక్‌రెడ్డి, దేవేందర్‌ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు