డిసెంబరు 15 నాటికి సిలబస్‌ పూర్తి

16 Nov, 2016 20:46 IST|Sakshi
డిసెంబరు 15 నాటికి సిలబస్‌ పూర్తి

మచిలీపట్నం(చిలకలపూడి) : పదో తరగతి 2017 సంవత్సరానికి పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు డిసెంబరు 15 నాటకి సిలబస్‌ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి చెప్పారు. ఆయన కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.40 నుంచి 5.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించామన్నారు. ఈ ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేక క్లాసులు సక్రమంగా నిర్వహించకపోతే సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాబోధన విషయంలో సమస్యలుంటే ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో తనకు నేరుగా ఫోన్‌ చేయవచ్చని డీఈవో తల్లిదండ్రులకు సూచించారు. సబ్జెక్టు టీచర్ల కొరత ఉంటే సంబంధిత ఉప విద్యాశాఖాధికారి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల విద్యాబోధన, విద్యార్థుల హాజరుపై ప్రతిరోజూ నివేదికలు డీఈవో కార్యాలయానికి పంపాలన్నారు.
ఈ నెల 18లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి :
ఈ నెల 18వ తేదీలోగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో తెలిపారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ. 125, మూడు సబ్జెక్టులలోపు ఉన్న విద్యార్థులు రూ.110, మూడు సబ్జెక్టులు పైబడిన ఉన్న విద్యార్థులు రూ.125 ప్రధానోపాధ్యాయులకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రధానోపాధ్యాయులు 19వ తేదీన సంబంధిత ఖజానాశాఖ కార్యాలయంలో జమ చేయాలని సూచించారు. ఈ ఫీజుల కంటే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఎక్కువ వసూలు చేస్తే తల్లిదండ్రులు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆధార్‌ నమోదు చేసుకున్న విద్యార్థులు మాత్రమే ఫీజు చెల్లించేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో నామినల్‌ రోల్స్, విద్యార్థుల వివరాలను డీఈవో కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలు ఉంటే డిసెంబరు 1 నుంచి 31వ తేదీలోగా ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8గంటల్లోపు తనకు నేరుగా ఫోన్‌ చేయవచ్చునని డీఈవో చెప్పారు. తోట్లవల్లూరు మండలంలోని పాఠశాలలన్నీ ఆదర్శపాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జనవరి 1వ తేదీ నాటికి మండలంలోని అన్ని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ (పరీక్షలు) లింగేశ్వరరావు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు