ఇంటికి రావాలంటే జరిమానా కట్టాల్సిందే..

10 Feb, 2016 09:53 IST|Sakshi
ఇంటికి రావాలంటే జరిమానా కట్టాల్సిందే..

మలేసియాలో నిబంధనలకు విరుద్ధంగా మన కార్మికులు
భారీ జరిమానా వసూలు చేస్తున్న ప్రభుత్వం

 
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): పర్యాటకుల స్వర్గధామంగా పిలిచే మలేసియాలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు నరకయాతన పడుతున్నారు. స్వదేశానికి వద్దామన్నా.. అక్కడ పని చేద్దామన్నా నిబంధనలు అడ్డుపడుతుండడం.. భారీ జరిమానా భయంతో క్షణమొక యుగంలా బతుకుతున్నారు. గతంలో ఔట్‌పాస్ పొంది ఇంటికి వచ్చేందుకు మన కరెన్సీలో రూ. 15 వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉండగా, తాజాగా దానిని రూ. 45 వేలకు పెంచింది.

పర్యాటక ప్రాంతం కావడంతో తక్కువ పనికి ఎక్కువ వేతనం వస్తుందని ఏజెంట్లు ఇక్కడి నుంచి వేలాది మంది నిరుద్యోగులను మలేసియా పంపించారు. వర్క్‌వీసా పేరిట విజిట్ వీసాలపై అక్కడికి తరలించారు. అయితే, రూ లక్షల్లో అప్పు చేసి అక్కడికి వెళ్లిన వారు విజిట్ వీసా గడువు ముగిసినా.. చేసిన అప్పులు తీర్చడానికి నిబంధనలకు విరుద్ధంగా అక్కడే ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటున్నారు. అయితే, కొన్ని నెలలుగా మలేసియాలో వర్క్‌పర్మిట్, సరైన వీసా లేకుండా ఉంటున్న వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు అక్కడే బిక్కుబిక్కుమంటూ  బతుకుతున్నారు.

మరోపక్క ఇంటికి వద్దామంటే పాస్‌పోర్టులు ఏజెంట్ల చేతిలో ఉండడంతో దిక్కుతోచకున్నారు. మూడేళ్లుగా అక్కడ ఉంటున్న వారు ఇంటికి వచ్చేందుకు మలేసియాలోని ఇండియన్ హై కమిషన్‌ను ఔట్ పాస్ కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే, మన హైకమిషన్ ఔట్‌పాస్ జారీ చేసినా వీసా లేకుండా మలేసియాలో ఉన్నందుకు అక్కడి ప్రభుత్వం జరిమానా వసూలు చేస్తోంది. గతంలో ఇండియన్ కరెన్సీలో రూ.15వేలు చెల్లిస్తే మలేసియా నుంచి ఇండియాకు వెళ్లడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చేది.

అయితే, మలేసియా ప్రభుత్వం  జరిమానాను భారీగా పెంచింది. ఇప్పుడు అలా ఇంటికి వెళ్లాలను కునేవారు రూ. 45 వేలు చెల్లించాల్సి వస్తోంది. జరిమానా మొత్తాన్ని పెంచడంతో ఇళ్లకు వెళ్దామనుకుంటున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడే ఉందామంటే పోలీసులు అరెస్టు చేస్తుండడంతో అయోమయంలో పడ్డారు. పోలీసులు అరెస్టు చేస్తే జరిమానా అయినా కట్టాలి.. లేదంటే జైలుకైనా వెళ్లాల్సి ఉండడంతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు