సెలవుల్లోౖనైనా.. చక్కదిద్దేరా ?

1 Jun, 2017 00:59 IST|Sakshi
సెలవుల్లోౖనైనా.. చక్కదిద్దేరా ?

చిత్తూరు ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాల సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో పేద విద్యార్థుల చదువుకు అసౌకర్యాలు ప్రతిబంధంకంగా మారుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు కల్పించడంలో విద్యాశాఖ విఫలమవుతూనే ఉంది. సరిపడా గదులు లేక చెట్ల కింద, వరండాల్లో చదువులు చెప్పాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మరికొన్ని చోట్ల ఉన్నప్పటికీ విద్యార్థులకు అవసరమైన మేర లేక ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమయ్యే ఫర్నిచర్‌ కొరత, శిథిలమైన గదులు వంటి సమస్యలు తీరని సమస్యగానే వేధిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని చెబుతున్న పాలకులు, విద్యాశాఖ అధికారుల మాటలకు దిక్కు లేకుండాపోతోంది. ప్రతి ఏడాది సర్వశిక్షాఅభియాన్‌ ఇంజినీరింగ్‌ శాఖ, విద్యాశాఖ సర్వేలు చేయించి అసౌకర్యాల నివేదికలను తెప్పించుకుంటున్నారు తప్ప వాటిని పరిష్కరించే పనులను మాత్రం చేపట్టడం లేదు. ప్రస్తుతం సర్కారు బడులకు వేసవి సెలవులు కావడంతో స్కూళ్ల ప్రారంభానికి ముందు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తే అడ్మిషన్ల సంఖ్య పెరగడమే కాకుండా విద్యార్థుల చదువుకు ఎంతో మేలు చేకూర్చినట్లు అవుతుంది.

జిల్లావ్యాప్తంగా సర్కారుబడుల పరిస్థితులు..
జిల్లాలో సర్కారు బడుల్లోని విద్యార్థులను సమస్యలు కలవరపెడుతున్నాయి. ఎక్కువగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సరిపడా గదులు లేక వరండాలు, ఆరుబయటే చదువులు కొనసాగిస్తున్నారు. మరుగుదొడ్లు, నీటి కొరతతో మెజారిటీ పాఠశాలల్లో బాలురు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా బాలికల పరిస్థితి మరింత దారుణం. గతంలో ఉన్న జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఎస్‌డీఎఫ్‌ నిధులతో డెస్క్‌లను ఏర్పాటు చేసేలా నిధులు విడుదల చేశారు. అయితే ఆయన బదిలీ కావడంతో ఆ డెస్క్‌ల సంగతి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా పలు మండలాల్లో విరిగిన బెంచీలు, మరికొన్ని చోట్ల నేలబారు చదువులే దిక్కువుతున్నాయి.

సర్వశిక్షా ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం..
చాలా పాఠశాలల్లో తరగతి గదులకు మరమ్మతులు చేయక పాఠశాలల భవనాలు, తరగతి గదులు శిథిలావస్థకు చేరి పెచ్చులూడిపడుతున్నాయి. అలాంటి పాఠశాలలన్నింటినీ కూల్చివేయాలని గత ఏడాదే సర్వశిక్షా అభియాన్‌ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. భవనాల కొరత ఉన్న పాఠశాలల్లో అదనపు గదుల కోసం నిర్మాణాలు చేపట్టి అర్ధాంతరంగా  వదిలేశారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో తాగునీటి వసతి వేధిస్తోంది. విద్యార్థులు ఇంటి నుంచే బాటిళ్లలో తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక కంప్యూటర్లు, ప్రయోగశాలల పరికరాలు దుమ్ముపట్టిపోతున్నాయి. గత ఏడాది కంప్యూటరు క్లాసులు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో పలుచోట్ల అవి చోరీకి, మరమ్మతులకు గురై మూలనపడిపోయాయి. ఈ అసౌకర్యాల మధ్య కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.

సర్వేలో వెల్లడైన సమస్యలు..
జిల్లాలోని ప్రతి పాఠశాలలోనూ నెలకొన్న అసౌకర్యాలపై విద్యాశాఖ అధికారులు సర్వే చేయించారు. కానీ ఇప్పటికీ వాటిని పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 180 అదనపు తరగతి గదులు అవసరం కాగా, 250 పాఠశాలలకు మేజర్‌ మరమ్మతులు అవసరమని గుర్తించారు. ఉన్నత పాఠశాలల్లో 70 అదనపు తరగతి గదులు అవసరమని గుర్తించారు. ప్రాథమిక పాఠశాలలో బాలురు 60, బాలికలు 51, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బాలురు 14, బాలికలు 5, ఉన్నత పాఠశాలల్లో బాలురు 43, బాలికలు 31 ఉన్నచోట్ల మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయని వెల్లడైంది. మొత్తం పాఠశాలల్లో బాలురకు 20, బాలికలకు 80 మరుగుదొడ్ల కొరత ఉన్నట్లు తెలిసింది. వాటర్‌ సౌకర్యం లేని మరుగుదొడ్లు ప్రాథమిక పాఠశాలల్లో 450, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 240, ఉన్నత పాఠశాలల్లో 320 వరకు ఉన్నాయని తేలింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 9,500 డ్యూయల్‌ డెస్క్‌ల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు