ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్‌

20 Dec, 2016 22:31 IST|Sakshi
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్‌

మైదుకూరు టౌన్‌: జిల్లాలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని మైదుకూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప నగరం కటిక వీధికి చెందిన కటిక ఫరూక్‌ చికెన్‌షాపు నిర్వహించేవాడు. వ్యసనాలకు బానిసై షాపుల వద్ద ఉన్న ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతూ వాటిని అమ్మిన డబ్బుతో జల్సాలు చేసుకునేవాడు. కడపలో రెండు ద్విచక్ర వాహనాలు దొంగిలించి ఎం. గురవయ్య, ఎస్‌. నాగరాజు అనే వ్యక్తులకు విక్రయించాడు. అలాగే జిల్లాలో మరో రెండు చోట్ల రెండు టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాలు, మైదుకూరులో రెండు ఎక్సెల్‌ వాహనాలు చోరీ కావడంతో  పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. మంగళవారం కడప- కర్నూలు జాతీయ రహదారిలో సరస్వతీపేట వద్ద నెంబర్‌ప్లేట్‌ లేని ద్విచక్రవాహనంలో ఫరూక్‌ వస్తుండగా మైదుకూరు అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో పట్టుకొని విచారించగా ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు అంగీకరించాడు. మూడు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఇప్పటి వరకు 6 వాహనాలను దొంగిలించగా వాటిలో 4 ఫరూక్‌ వద్దనే ఉన్నట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ వివరించారు. నిందితుడితో పాటు వాహనాలు కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరు పరచినట్లు ఆయన తెలిపారు.  ఈ విలేకర్ల సమావేశంలో అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు, అర్బన్‌ ఎస్‌ఐ రామకృష్ణ, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్‌ గుర్రప్ప, కానిస్టేబుళ్లు ఇజ్రాయిల్, సాగర్, శ్రీకాంత్, ఉదయ్‌లు ఉన్నారు.

మరిన్ని వార్తలు