ఎన్నాళ్లీ వేదన..!

15 Sep, 2016 00:17 IST|Sakshi
పద్మశ్రీ సర్కిల్‌ వద్ద ఆగిపోయిన వాహనాలు
పలమనేరు ప్రజల చికాకు
సాయత్రం పూట గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌
కొండెక్కిన రోడ్డు విస్తరణ పనులు 
పత్తా లేని బైపాస్‌ రోడ్డు
పలమనేరు : పట్టణంలోని పలు సర్కిళ్లలో ట్రాఫిక్‌ స్తంభించడం నిత్యకృత్యంగా మారింది. చెన్నై– బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న పలమనేరు పట్టణ జనాభా 60 వేలకు పైబడే ఉంది. ప్రస్తుత రోడ్డు స్థితి పది వేల వాహనాల రాకపోకలకు అనువుగా ఉంటే, రోజుకు ప్రస్తుతం 30 వేలకు పైగా వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. పాతకాలం నాటి రహదారి కావడం వల్ల ట్రాఫిక్‌ కష్టాలు ఎక్కువయ్యాయి. 
ఇక్కడే ట్రాఫిక్‌ కష్టాలు
పట్టణంలోని జాతీయ రహదారిపై అంబేద్కర్‌ సర్కిల్, పద్మశ్రీ, గుడియాత్తం సర్కిల్, ఏటిఎం సర్కిల్, రంగబాబు సర్కిల్, పెట్రోల్‌బంక్‌ ప్రాంతాల వద్ద రోజుకు పది నుంచి 20 సార్లు ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. రహదారి ఇరుక్కుగా ఉండడం, చెన్నై నుంచి బెంగళూరు వైపునకు వెళ్లే భారీ కంటైనర్లతో వాహనదారులు, ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. 
పోలీసులకు భారం
స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో 15 మంది కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులతో పాటు పట్రోలింగ్‌ పోలీసులు ఇద్దరు ఉన్నారు. ట్రాఫిక్‌ స్తంభించిన ప్రతిసారి వారంతా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయినా సమస్య జఠిలంగా ఉంటోంది. 
కొండెక్కిన  విస్తరణ పనులు
పలమనేరు పట్టణంలో జాతీయ రహదారికి ఆనుకుని స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి గంటావూరు టెర్రకోట కాలనీ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు సర్వే చేశారు. మార్కింగ్‌ కూడా వేశారు.  పనులు మాత్రం ముందుకు సాగలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ పనులు పూర్తి చేయడం ప్రస్తావర్హాం. కాగా పట్టణంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ఎన్‌హెచ్‌ శాఖ రంగం సిద్ధం చేసినా, మూడేళ్లుగా ఆ పనులు ముందుకు సాగడం లేదు.
బైపాస్‌ రోడ్డు వస్తేనే...
పట్టణంలోని మెయిన్‌ రోడ్డు దాటాలంటే భయమేస్తుంది. విపరీతమైన వాహనాలు, ట్రాఫిక్‌ సమస్య ఎక్కువైంది. రోడ్డు సామర్థ్యానికి మించి బండ్లు వస్తా ఉంటే ఇబ్బందే గదా. బైపాస్‌ రోడ్డు  నిర్మాణం జరిగితేనే ఈ సమస్య తీరుతుంది.
– వెంకటరమణ, పలమనేరు
ట్రాఫిక్‌ క్రమబద్ధీకరిస్తున్నాం
పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంది. వాహణాల సంఖ్య అమాంతం పెరిగింది. ముఖ్యంగా సాయంత్రం పూట రద్దీ కారణంగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు పటిష్టంగానే వ్యవహరిస్తున్నాం. బైపాస్‌ రోడ్డు వస్తే ఆపై ఎటువంటి ఇబ్బంది ఉండదు. 
– సురేందర్‌ రెడ్డి, సీఐ, పలమనేరు
 
>
మరిన్ని వార్తలు