ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఇద్దరి అరెస్టు

7 Sep, 2016 00:05 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు
సీతంపేట : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని  గిరిజన  నిరుద్యోగుల  నుంచి లక్షల రూపాయిలు వసూలు చేసి టోకరా పెట్టిన  ఇద్దరు మోసగాళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని  మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి  నుంచి ఒక బైక్, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. పాలకొండ డీఎస్‌పీ సీహెచ్‌ ఆదినారాయణ, కొత్తూరు సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ వి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు...రైల్వేలో క్లరికల్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కర్ణాటక రాష్ట్రంలోని బల్లార్‌పూర్‌ జిల్లా రామలింగాపురానికి చెందిన  ఆర్‌.ఎన్‌.రామనుజనప్ప ఆయన తండ్రి నారాయణస్వామిలు సీతంపేట, కొత్తూరు, భామిని మండలాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.16 లక్షలు  దపదఫాలుగా వసూలు చేశారని తెలిపారు.  సీతంపేట మండలం ఎర్రన్నగూడ గ్రామానికి చెందిన ఎస్‌.మల్లేశ్వరరావు బీటెక్‌ పూర్తి చేసి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోచింగ్‌ కోసం బల్లార్‌పూర్‌ వెళ్లాడు. అక్కడ పరిచయమైన రామానుజనప్ప రైల్వేలో క్లరికల్‌ కేడర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని మీ స్నేహితులు ఎవరైనా ఉంటే చూడాలని చెప్పడంతో మల్లేశ్వరరావుతో పాటు సీతంపేట మండలంలో ఆరుగురు, భామిని, కొత్తూరు మండలాల నుంచి  ఒక్కొక్కరు చొప్పున మొత్తం రూ.16 లక్షలు దపదఫాలుగా ఇచ్చేశారు.
 
కొన్నాళ్ల తరువాత ఉద్యోగం సంగతేంటని ప్రశ్నించేసరికి తప్పుడు ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా మళ్లీ డబ్బులు చాలవని తేవాలని చెప్పడంతో అనుమానం వచ్చిన మోసపోయిన నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వలపన్ని నిందితులను పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్‌పీ తెలిపారు. సీతంపేట, బత్తిలి, కొత్తూరు  పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదు చేశామని చెప్పారు.
 
మరిన్ని వార్తలు