కొత్తగా రెండు.. ఆర్టీఏ కార్యాలయాలు

29 Aug, 2016 23:52 IST|Sakshi
కొత్తగా రెండు.. ఆర్టీఏ కార్యాలయాలు
  • హన్మకొండ, భూపాలపల్లిలో ఆర్టీఏ కార్యాలయాల ఏర్పాటు
  • మహబూబాబాద్‌ యూనిట్‌ అప్‌గ్రేడ్‌
  • కొత్త జిల్లాల నేపథ్యంలో రవాణ శాఖ కసరత్తు
  • సాక్షి, హన్మకొండ :  కొత్తగా ఏర్పాటు కానున్న హన్మకొండ, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో కొత్త కార్యాలయాల ఏర్పాటుకు  జిల్లా రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం మహబూబాబాద్‌లో ఉన్న ఉప రవాణాశాఖ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం వరంగల్‌ నగరంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఉండగా జనగామ, మహబూబాబాద్‌లలో ఉప రవాణా కార్యాలయాలు (ఎంవీఐ కార్యాలయం) ఉన్నాయి.

    జిల్లా కేంద్రంలోని జిల్లా  రవాణాశాఖ కార్యాలయం ఆవరణలో ఖమ్మం, వరంగల్‌ జిల్లాల రవాణాశాఖ కమిషనర్‌ కార్యాలయం కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వరంగల్‌ జిల్లా వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలుగా విడిపోనుంది. జనగామ యాదాద్రి జిల్లాలోకి వెళ్తుంది. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు జిల్లాలకు కలిపి జిల్లా రవాణాశాఖ కార్యాలయం, మహబూబాబాద్‌లో ఉన్న మోటారు వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ కార్యాలయం మిగలనున్నాయి. దీంతో విభజనకు అనుగుణంగా కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


    హన్మకొండ, భూపాలపల్లిలో కొత్తగా..
    ప్రస్తుతం వరంగల్‌ మండల పరి«ధిలో ఉన్న జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని వరంగల్‌ జిల్లాకు కేటాయించనున్నారు. మహబూబాబాద్‌లో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయాన్ని జిల్లా ఆఫీసుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో ఈ రెండు జిల్లాలో రవాణాశాఖ కార్యాలయాల ఏర్పాటు సులభం కానుంది. మిగిలిన హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండు జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవనాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు.


    వాహనాలకు కొత్త కోడ్‌..
    ప్రస్తుతం వరంగల్‌ జిల్లాలో వాహనాల రిజిష్ట్రేషన్‌ నంబర్‌ టీఎస్‌03గా ఉంది. కొత్తగా రాబోతున్న మూడు జిల్లాలకు ఈ నంబర్‌ను కొనసాగించరు. రాష్ట్రంలో రవాణా శాఖ పరంగా ప్రస్తుతం 1 నుంచి 16 నెంబరు వరకు ఉన్నాయి. కొత్త జిల్లాలకు 17వ నెంబరు నుంచి వరుసగా కేటాయించనున్నారు. ఈ జిల్లాలకు ఆంగ్ల అక్షరమాల క్రమంలో జిల్లా కోడ్, సీరీస్‌ నంబర్లు ఇచ్చే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు