ఆ పద, స్వరాలకు అవార్డులు

28 Jul, 2017 22:58 IST|Sakshi
ఆ పద, స్వరాలకు అవార్డులు
-యునెస్కో పోటీల్లో ‘రాధాకృష్ణ’ విద్యార్థినుల ప్రతిభ
-నాట్య, సంగీత విభాగాల్లో బహుమతుల పంట
రాజమహేంద్రవరం కల్చరల్‌ : జిల్లాలోని ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగిన దారోహర్‌ అంతర్జాతీయ సంగీత నృత్యపోటీలలో పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక ప్రకాష్‌ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు గోరుగంతు బదరీ నారాయణ అవార్డులను ప్రదర్శించి, వివరాలను వెల్లడించారు. యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషన్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాధాకృష్ణ విద్యార్థినులు అన్ని విభాగాలలో బహుమతులను గెలుచుకున్నారు. అద్భుతమైన కొరియోగ్రఫీని అందించినందుకు రాధాకృష్ణ అధ్యాపకురాలు గోరుగంతు ఉమాజయశ్రీ ‘కళాకుంజ్‌’ అవార్డును, అన్ని విభాగాలలో ప్రధాన పాత్ర పోషించిన కళాక్షేత్ర విద్యార్థిని లక్ష్మీదీపిక ‘కళాప్రభ’ అవార్డును గెలుచుకున్నారు. మరో విద్యార్థిని మాధురి లలితసంగీతంలో తృతీయ బహుమతిని, లక్ష్మీదీపిక, సునంద కూచిపూడి విభాగంలో ప్రథమ బహుమతిని సాధించారు. జూనియర్స్‌ విభాగంలో వినాయక కౌతం బృందం కళాకారులు ప్రథమ బహుమతిని, వీణ ఫ్యూషన్‌లో ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. గోదావరి హారతి, నవరాగమాలికా వర్ణాలకు ప్రథమ బహుమతి కూడా లభించింది. అన్ని విభాగాలలో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు మొత్తం 15 బహుమతులను గెలుచుకుని, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటారని నారాయణ చెప్పారు. ఏ వేదికపై ప్రదర్శనలు ఇచ్చినా సనాతన భారతీయ వైభవాన్ని ప్రచారం చేయడమే తమ లక్ష్యమన్నారు. విలేకరుల సమావేశంలో కళాక్షేత్ర అధ్యాపకురాలు ఉమాజయశ్రీ, పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ ఖాన్, సభ్యులు పి.సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు