కీచులాటల పాలన

3 Jul, 2016 09:09 IST|Sakshi

నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. పాలన గాడి తప్పడంతోపాటు అవినీతి పెచ్చుమీరింది. స్ట్రాంవాటర్ డ్రెయిన్ నిర్మాణానికి కేంద్రం మంజూరు చేసిన రూ.461 కోట్లను వినియోగంలోకి తేవడంలో పాలకులు విఫలమయ్యారు. మంచినీటి చార్జీలు ఏడాదికి ఏడు శాతం చొప్పున పెరుగుతున్నాయి. గతేడాది దర్గా భూములు, శ్రీకనకదుర్గా సొసైటీ లేవఅవుట్ వివాదాల్లో చిక్కుకున్న పాలక వర్గం ఈ దఫా విజ్ఞానయాత్రతో రచ్చకెక్కింది. అసమ్మతి వర్గం మేయర్ చైర్‌ను టార్గెట్ చేసి దూకుడు పెంచింది.
 
విజయవాడ : నగర పాలన మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. నగరపాలక సంస్థలో అవినీతిని కట్టడి చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య, ఎస్టేట్ సెక్షన్ల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరునెలలుగా తిరుగుతున్నా ఇంటిపన్ను వేయడం లేదని ఇటీవల జరిగిన జరిగిన కౌన్సిల్ సమావేశంలో డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు చెప్పిన ఘటన పాలన ఎంతబాగా సాగుతుందోననే విషయాన్ని పట్టిచూపుతోంది.
 
గడిచిన రెండేళ్లలో ఎనిమిది కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అధికారపార్టీ కార్పొరేటర్ల కలెక్షన్ల దందాపై బలమైన విమర్శలు ఉన్నాయి. పన్నుభారాలు మోపబోమంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించారు. మంచినీటి చార్జీలను ఏటా 7 శాతం పెంచాలని ప్రత్యేక అధికారుల పాలనలో చేసిన నిర్ణయాలనే నేటికీ యథాతథంగా అమలుచేస్తున్నారు. అమృత్ పథకంలో భాగంగా నీటి మీటర్ల ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నారు.
 
ఇవీ వైఫల్యాలు
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్ల పథకాన్ని పూర్తి చేయడంలో పాలకవర్గం పిల్లిమొగ్గలేసింది. నగరానికి జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లు 28,152 ఇళ్లు మంజూరవగా నాలుగు విడతల్లో 18,176 ఇళ్ల నిర్మాణం చేపట్టి 13,664 ఇళ్లను పూర్తి చేశారు. స్థలాభావం కారణంగా పదివేల ఇళ్లను పూర్తి చేయలేమని గతేడాది ప్రభుత్వానికి లేఖరాసిన నగరపాలకులు, 4,512 ఇళ్లను పూర్తి చేయడంలోనూ విఫలమయ్యారు.
 
స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.461 కోట్ల నిధులు రాబట్టడంలో సఫలమైన మేయర్ శ్రీధర్ వాటి వినియోగించడంలో విఫలమయ్యారు. ఏడాది క్రితమే నిధులు విడుదలయ్యాయి. డ్రెయిన్ల నిర్మాణం కోసం ఇరవై రోజుల క్రితం  పబ్లిక్‌హెల్త్ విభాగం టెండర్లు పిలవగా 14 శాతం ఎక్సెస్ పడ్డాయి. దీంతో మరోమారు టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టెండర్ల దశదాటి పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో వేచిచూడాలి.  
 
కీచులాటలు
టీడీపీలో అంతర్గత కీచులాటలు అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయి. స్టాండింగ్ కమిటీ, మేయర్ మధ్య సయోధ్య కొరవడింది. ఫలితంగా తీర్మానాలు తిర‘కాసు’ మయమవుతున్నాయి. కార్పొరేర్ల విజ్ఞానయాత్ర వివాదాస్పదంగా మారింది. అధికారపార్టీ కార్పొరేటర్లు తోటి మహిళా ప్రయాణికులతో అసభ్యంగా వ్యవహరించి చెడ్డపేరు తెచ్చుకున్నారు.

మేయర్ చైర్‌ను టార్గెట్ చేసిన అసమ్మతి వర్గం దూకుడు పెంచింది. మేయర్‌తో మాటామంతి కూడా ఆపేసింది. ఎంపీ కేశినేని నాని జోక్యం నేపథ్యంలో పుష్కరాల వరకు తాత్కాలిక విరామం ప్రకటించింది. ఇష్టం లేకుంటే తనను మార్చేయాలని స్వయంగా మేయర్ టీడీపీ పెద్దల ముందు వాపోయినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీనే గ్రూపు లను ప్రోత్సహించడంతో మేయర్ చైర్ బలహీనపడింది. రెండేళ్ల పాలనలో స్వపక్షం కార్పొరేటర్లే మేయర్‌ను ముప్పుతిప్పలు పెట్టడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు