చీకటి కమ్మిన బతుకులు

24 Sep, 2016 23:48 IST|Sakshi
చీకటి కమ్మిన బతుకులు

– కాలమే శాపంగా...
– మంచానపడ్డ తండ్రి.. వైధవ్యంతో కూతుళ్లు..
– పస్తులుంటోన్న పేద కుటుంబం
– వితంతు పింఛన్లూ రాలేదు
– ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు


అందరూ ఆడపిల్లలు పుట్టగానే భారమనుకుంటారు.. కానీ ఆ ఇంట నలుగురు ఆడపిల్లలు పుట్టగానే మా ఇంట మహాలక్ష్ములు పుట్టారని ఆ తండ్రి సంబరపడ్డాడు. ఏ జీవనాధారం లేకున్నా.. కూలికెళ్లి అందరినీ పెద్ద చేసి, పెళ్లిళ్లు చేసి, అత్తారింటికి పంపాడు.. కానీ కూతుళ్ల బతుకుల్లో ఎంతోకాలం వెలుగులు నిలవలేదు..వారి బతుకుల్లో చీకటి కమ్ముకుందా అన్నట్లు ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురి కూతుళ్ల భర్తలను మత్యువు తీసుకెళ్లింది.

మరో కూతురైనా సంతోషంగా ఉంటుందనుకుంటే ఆమె భర్తా వదిలేసి వెళ్లిపోయాడు. ఇంత బాధను దిగమింగుకుని కుటుంబాన్ని ఈదుతున్న ఆ తండ్రికీ ప్రమాదవశాత్తు మిద్దెపై నుంచి కిందపడి వెన్నెముక దెబ్బతినింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. నలుగురి కుమార్తెల పోషణ బాధ్యత మీద పడింది. కుటుంబ పోషణ భారమైంది. వైద్యం చేయించుకుందామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. పింఛనూ రాలేదు. కూతుళ్లకు వితంతు పింఛన్లు ఇవ్వలేదు. కూలికెళ్లితేనే కుటుంబం గడిచే ఆ ఇంట అందరూ పస్తులతో ఉండాల్సి వస్తోంది.

ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్న వడ్డే చిన్నకాటమయ్య, రామలక్ష్మమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు. పెద్ద కుమార్తె నాగమల్లేశ్వరి భర్త ఆరేళ్ల క్రితం అప్పులబాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కుమార్తె తండ్రివద్ద చేరింది. రెండో కుమార్తె వరలక్ష్మి భర్త కూడా మతిచెందాడు. నాల్గో కుమార్తె సరిత భర్త రోడ్డు ప్రమాదంలో మతి చెందాడు. మూడో కుమార్తె మందాకినికి పెళ్లి చేయగా భర్త కామెర్ల వ్యాధితో మతి చెందాడు. మందాకినికి మరో పెళ్లి చేయగా ఒక కూతురు పుట్టగానే భర్త వదిలేసి వెళ్లిపోయాడు. నలుగురు కూతుళ్లూ తండ్రిమీద ఆధారపడ్డారు.

తండ్రి కాటమయ్య పాత భవనం తొలగించే పనిలో పైనుంచి కిందపడి వెన్నెముక దెబ్బతింది. దీంతో కాళ్లు, చేతులు పనిచేయక మంచానికే పరిమితమయ్యాడు. తల్లి రామలక్ష్మమ్మ కుటుంబ పోషణ కోసం ఇంటి పనులు చేస్తూ ఆ వచ్చే అరకొర కూలితో నెట్టుకొస్తోంది. పూట గడవడమే కష్టంగా మారిన ఆ కుటుంబానికి ఆదరణ కరువైంది. దీంతో వైద్యం కోసం, కుటుంబ పోషణ కోసం దాతల నుంచి సాయాన్ని అర్థిస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు కన్నీటితో వేడుకుంటున్నారు.

పింఛన్లూ రాలేదు
కాళ్లు, చేతులు పడిపోయిన కాటమయ్యకు వద్ధాప్య పింఛను రాకపోగా వితంతువులైన తన కూతుళ్లు నాగమల్లేశ్వరి, సరితలకు కూడా పింఛను అందలేదు. ఎన్నిమార్లు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదని వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబంలోని వారికి పింఛన్లు మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవిస్తున్నారు.

మరిన్ని వార్తలు