సీసీ కెమెరాకు చిక్కిన ఇంజక్షన్ సైకో

12 Sep, 2015 13:55 IST|Sakshi
సీసీ కెమెరాకు చిక్కిన ఇంజక్షన్ సైకో

ఏలూరు : ఉభయగోదావరి జిల్లాల పోలీసులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇంజక్షన్ సైకో కేసులో పురోగతి కనిపిస్తోంది. తమ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఇంజక్షన్ సైకోను గుర్తించామని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అంటున్నారు. బాధితులు పేర్కొన్న వివరాలను పోలిన ఓ వ్యక్తిని సీసీ కెమెరాలో గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ సహాయంతో ఇంజక్షన్ సైకో కోసం జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంజక్షన్ సైకోను పట్టుకోవడం కోసం 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

49 చెక్ పోస్టుల వద్ద గట్టి భద్రత ఏర్పాటుచేశారు. 400 మంది పోలీసులు సైకో జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఇంజక్షన్ సైకో బ్లాక్ క్యాప్ ధరించి, బ్లాక్ హోండో షైన్ బైక్పై తిరుగుతున్నాడని జిల్లా పోలీసు యంత్రాంగం వెల్లడించింది. జిల్లాలోని భీమవరంలో పల్సర్ బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం నాడు వెంబడించి ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదిలాఉండగా, ఇంజక్షన్ సైకో తెలంగాణలోని హైదరాబాద్, నల్లగొండ జిల్లా కోదాడలలో కూడా సంచరిస్తున్నట్లు పలు కథనాలు వచ్చిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు