'వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరాం'

4 Aug, 2015 17:39 IST|Sakshi
'వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరాం'

విజయవాడ: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఘటనపై ఏపీ ఎన్జీవో చైర్మన్ విద్యాసాగర్ స్పందించారు. వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈనెల 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు ఏపీ ఎన్జీవో, జేఏసీల నుంచి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ధర్నాకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

ఈ ధర్నాకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానిస్తామన్నారు. ఈనెల 8వ తేదీన రాష్ట్ర ఉద్యోగ నేతలంతా కేంద్ర హోంమంత్రిని, మిగిలిన కేంద్ర మంత్రులను ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరతామన్నారు. దీంతో పాటు ఈనెల 10 వ తేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు కూడా తాము సంఘీ భావం తెలుపుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ఎవరు ఉద్యమం చేసినా తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ నెల 16వ తేదీన జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరులో విభజన హామీలపై సమావేశం ఏర్పాటు చేసి.. తమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు