కదంతొక్కిన మహిళా లోకం

28 Jan, 2017 23:41 IST|Sakshi
కదంతొక్కిన మహిళా లోకం

– జాస్నవిరెడ్డి హత్యకేసు నిందితులను శిక్షించాలని డిమాండ్‌
– ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా


అనంతపురం సెంట్రల్‌ : వరకట్న వేధింపులకు బలైన జాస్నవిరెడ్డి ఆత్మహత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థినులు కదంతొక్కారు. జాస్నవిరెడ్డి తల్లిదండ్రులు రేవతి, సూర్యప్రతాప్‌రెడ్డితో కలిసి ఆల్‌ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం, ఆల్‌ ఇండియా డెమెక్రాటిక్‌ యూత్‌ ఆర్గనైజేషన్, ఆల్‌ ఇండియా డెమోక్రాటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నగరంలో టవర్‌క్లాక్‌ నుంచి ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లలిత మాట్లాడుతూ వరకట్న వేధిపులకు జాస్నవిరెడ్డి బలై పదిరోజులు గడిచినప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నిందితులు సమాజంలో పెద్ద మనషులుగా చెలామణీ అవుతూ   నేరం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. అనంతరం ఎస్పీని కలిసేందుకు అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రమే అనుమతి ఇవ్వడంపై మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐడీవైఓ జిల్లా కార్యదర్శి తబ్రేజ్‌ఖాన్, ఏఐడీఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, పలు కళాశాలల విద్యార్థినులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు