ఇక్కడా... నో క్యాష్‌

13 Jan, 2018 12:57 IST|Sakshi

ఇంట్లో చూస్తే నో మనీ.. ఏటీఎంలకు వెళ్తే ‘నో’ క్యాష్‌. బ్యాంకుకు వెళ్తే ‘నగదు’ పరిమితి. ఇలా ఎక్కడ విన్నా ... ఏ నోట విన్నా ఇదే మాట. పండుగపూట చేతిలో సొమ్ములు లేక నానాయాతన పడుతున్నారు. డబ్బుండీ బ్యాంకుల నుంచి తీసుకునే అవకాశంలేక తలలు పట్టుకుంటున్నారు. నోట్ల రద్దయి ఏడాది దాటినా అదే పరిస్థితి పునరావృతమవడంతో  ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కాకినాడ:   పండుగపూట జిల్లా వాసులకు నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. బ్యాంకుల్లోను, ఏటిఎంల్లో నగదు నిల్వలు అడుగంటిపోవడంతో డబ్బులకోసం నానాయాతన పడుతున్నారు. జిల్లాలో 815  ఏటిఎంలుండగా వీటిలో 75 శాతం మూతపడిపోగా కొద్దోగొప్పో నగదు నిల్వలున్న ఏటీఎంల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఓ వైపు పండుగ సందడి దగ్గరపడడం, మరో వైపు వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రావడం, తగినంతగా బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేకపోవడంతో  అవస్థలుపడుతున్నారు.

విత్‌డ్రాలు మాత్రమే...
బ్యాంకుల నుంచి గడచిన వారం పది రోజుల్లో నగదు తీసుకువెళ్లడం మినహా ఏ ఒక్కరూ డిపాజిట్లు చేస్తున్న దాఖలాలు కనిపించడంలేదని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రభావం పడింది. మరోవైపు కొన్ని బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదన ప్రకటన ప్రభావం కూడా ఈ సంక్షోభానికి కారణంగా బ్యాంకర్లు చెబుతున్నారు.

నగదుపై పరిమితి
జిల్లాలో సుమారు 750 వివిధ బ్యాంకు బ్రాంచీల ద్వారా నిత్యం రూ.600 నుంచి రూ.700 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఈ లావాదేవీలు 30 శాతానికి దిగజారిపోయాయని సమాచారం.
దీని కారణంగా అందుబాటులో ఉన్న కొద్దిపాటి నగదుపై అనేక బ్రాంచీల్లో పరిమితులు కూడా పెట్టేశారు. ఒకప్పుడు నోట్ల రద్దు సమయంలో ఇచ్చినట్టుగా రోజుకి రూ.5 నుంచి రూ.20వేలు వరకు ఆయా బ్యాంకులు పరిమితి విధిస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు.

పండుగ ఎలా?
బ్యాంకు వరుస సెలవులు, ఏటీఎంలలో డబ్బు లేకపోవడంతో పండుగ ఎలా జరుపుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. పండుగపూట ఇవేమి కష్టాలంటూ గగ్గోలు పెడుతున్నారు.

ఉన్నతాధికారులకు చెప్పాం
బ్యాంకుల్లో తగినంతగా నగదు నిల్వ లు లేవు. దీని కారణంగా ప్రజల అవసరాల మేరకు క్యాష్‌ అందివ్వలేకపోతున్నాం. ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు తగినంతగా నగదు సరఫరా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. సమస్యను ఉన్నతాధికారులకు, ఆయా బ్యాంక్‌ యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్ళాం. – కె.ఆదినారాయణమూర్తి, సంయుక్తకార్యదర్శి, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ

మరిన్ని వార్తలు