రజాకార్లను వణికించిన అనభేరి

15 Aug, 2017 17:43 IST|Sakshi
రజాకార్లను వణికించిన అనభేరి

1910 ఆగష్టు 15వ తేదిన కరీంనగర్ జిల్లా పోలంపల్లి వాస్తవ్యులైన దేశ్‌ముఖ్, జమిందార్ అనభేరి వెంకటేశ్వర్ రావు, రాధా దేవి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. వీరు కరీంనగర్‌లో ప్రాథమిక విద్య తరువాత మచిలీపట్నంలో కొంతకాలం చదివి తరువాత, హైదరాబాద్ చాదర్‌ఘాట్  హైస్కూల్, బెనారస్ కాశీ విద్యాపీఠ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. స్వతహాగా ఆదర్శ భావాలు కలిగిన ఆయన విద్యార్థి దశ నుంచే నిజాం వ్యతిరేక ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. ఇంకా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా వీరు వెళ్ళలేదు, అందరు దొరల కొడుకుల్లాగా దొరతనాన్ని ఎంచుకోలేదు. విలాసవంతమైన జీవితం వైపు దేశ్‌ముఖ్ మొగ్గు చూపలేదు, ఆడంబరమైన జమిందారీ అధికారాలకి ఆకర్షితులవ్వలేదు.

అనభేరికి తన 27వ ఏట అప్పటి చెన్నూర్ తాహసీల్దార్ వెల్ముల నారాయణ రావు, లక్ష్మీనర్సుభాయి గార్ల చిన్న కుమార్తె సరళా దేవి గారితో పెళ్లి అయింది. సరళా దేవి గారు అనభేరి గురించి విని ఆయన ఆదర్శాలకు ఆకర్షితురాలై ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఆయనకు భార్య అవడమే కాకుండా ఆ కాలంలో 8వ తరగతి వరకు చదువుకొన్న ఆమె అనభేరికి అన్ని విధాల సహకరించేవారు. భర్తతో పాటు మీటింగుల్లోనూ, సభల్లోనూ, ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో, సమావేశాల్లో వీరిద్దరూ పాటల రూపంలో ప్రజలను ఉత్తేజపరచేవారు. తమ ఇంటికీ వచ్చే లెక్కలేనంత మంది పార్టీ కార్యకర్తలకి అన్నపూర్ణమ్మలా స్వయంగా పనివాళ్ళ సాయం లేకుండా భోజనాలు సమకూర్చేది. జనానికి స్ఫూర్తి ప్రభాకర్ రావు గారైతే ఆయన స్ఫూర్తికి మూలం సరళాదేవి గారయ్యారు.

1938లో ఆంధ్ర మహాసభకి జిల్లా సెక్రెటరీగా పని చేసిన అనభేరి హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభ ప్లీనరీలో ప్రముఖ పాత్ర పోషించారు. తాను ధనిక, పెత్తందారీ వర్గానికి చెందిన వాడినని, పేద ప్రజలు తన వ్యతిరేక వర్గానికి చెందిన వాళ్లని ఆయన అందరు దొరల్లాగ ఆలోచించ లేదు. తాను తినే పంచభక్ష్య పరమాన్నాల్లో ఆయనకు పేదవాడి రక్తం మరియు ఆకలి కనిపించింది. పట్టు పరుపుల మీద పడుకునే ఆయనకు పేదవాడి అప్పుల సెగ తగిలింది. తన చుట్టూ ఉన్న దాసీలలో కనిపించని స్త్రీ జాతి సంకెళ్ళు ఆయనను కదిలించాయి. పాలేర్ల వెట్టి బ్రతుకుల్లోని భారం ఆయన వెన్ను తట్టింది. ఆదర్శమూర్తైన  ప్రభాకర్ రావు గారు ఇంటి నుంచే తన ఆదర్శాలను అమలు చేశారు.

పాలేర్ల పిల్లలకు చదువులు చెప్పించారు. తమ ఇంట్లోని దాసీలకు పెళ్లిళ్లు చేసి పంపించడమే కాకుండా వారికి ఇండ్లు కట్టించి ఇచ్చి, వాళ్ళ దాస్య శృంఖలాలను తెంచి వేసి, వాళ్ళ జీవితాల్లో స్వేచ్చా వెలుగులు నింపి, స్త్రీ జాతికి గౌరవాన్ని అందచేసి మహా పురుషుడయ్యారు అనభేరి. ఈయన ఆర్య సమాజ్‌ సిద్ధాంతాలను ఆచరించి ఇంట్లో అందరిని ఆచరింప చేశారు. మాంసంతో పాటు మద్యాన్ని కూడా నిషేధింప చేశారు. ప్రతి దసరాకి తమ జమిందారీకి 66 ఊర్ల నుండి వెట్టిగా/కానుకగా వచ్చే గొర్రె పిల్లలను మానిపించారు.

ఆ రోజుల్లో రజాకార్ల అమానుషత్వానికి గురౌతున్న ప్రజల బ్రతుకులు అనభేరిని కదిలించాయి. ప్రజలకు చదువు నేర్పి వాళ్ళను  చైతన్యవంతులను చేయడానికి ఆయన కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డలో వయోజనుల కోసం నైట్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఊర్లో ధాన్యం దొరకక ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ప్రభాకర్ రావు గారు గ్రెయిన్ బ్యాంకు నెలకొల్పి రైతులకు విత్తనాలను, ధాన్యాలను అందచేసేవారు. రైతులను చైతన్య పరచేందుకు రైతు మహాసభలు నిర్వహించేవారు అనభేరి. ఇలా ఎంతోమంది అన్నదాతలను ఆదుకొన్నారు.

నూలు దొరకక, మగ్గం ఆడక బ్రతుకులు సతమతమవుతున్న నేతన్నలను ఆదుకోవడానికి  ఊర్లలో సహకార సంఘాలు స్థాపించి హైదరాబాద్‌ కమిషనర్ నుండి పెట్టెల్లో నూలు తెచ్చి, చేనేత కార్మికులకు రేషన్ కార్డులు ఇప్పించి వాటి ద్వారా నూలు అందించేవారు. సిరిసిల్ల సెంటర్‌గా ఉండేది. ఇలా ప్రభాకర్ రావు గారు దాదాపు 40 వేల మందికి రేషన్ కార్డ్స్‌ ఇప్పించారు. అనభేరి 1942 నుండి 1946 వరకూ 5 సంవత్సరాలు రాష్ట్ర చేనేత సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి ఆయన ఎంతో మంది చేనేత కార్మికులను ఆకలి చావుల నుండి తప్పించి వారికి ఒక కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.

భారత కమ్యూనిస్ట్ పార్టీకి జిల్లా నుండి మొదటి వ్యక్తిగా నాయకత్వం వహించారు. సాయుధ పోరాటంలో భాగంగా వందలాది మందితో ఏర్పడ్డ దళానికి అనభేరి నాయకత్వం వహించి ఆదిలాబాద్, విజయవాడ, సిర్వంచ, చాందా, కరీంనగర్ దళాలకు సహచరుడు సింగిరెడ్డి భూపతిరెడ్డితో కలసి శిక్షణ ఇచ్చారు. 40 గ్రామాల్లో పటేల్ పట్వారీల వ్యవస్థకి వ్యతిరేకంగా దాడి చేసి దాస్తావేజుల్ని కాల్చివేయడం ద్వారా రైతుల అప్పు పత్రాల్ని, దొంగ పట్టాలు, భూమి పత్రాల్ని ఇతర పన్ను పత్రాల్ని కాల్చివేసి పెత్తందార్ల అమానుషత్వానికి గురౌతున్న పేద రైతులను కాపాడి వాళ్లను శాప విముక్తుల్ని చేశారు అనభేరి. ఆయన నాయకత్వంలో సాయుధ పోరాటం ఒక కొత్త దిశగా మలుపు తిరిగింది. గ్రామాల్లో పడి ఇళ్ళను కాల్చి వేసి, స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడుతున్న రజాకార్లను తమ దళంతో తరిమికొట్టి ప్రజల ప్రాణాల్ని స్త్రీల గౌరవాన్నిఆయన కాపాడారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి చేనేత కార్మికులకు లేని రేషన్ ఇప్పిస్తున్నారని, అప్పటి తాలుక్దార్ బాకూర్ హుస్సేన్ అనభేరికి ఎన్నోసార్లు వారంట్లు జారీ చేసిన ఆయన బెదరలేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అనభేరి కార్యక్రమాల్ని అడ్డుకునేందుకు ఆయనకు తాలుక్దార్ పదవిని ప్రభుత్వం ఆశ చూపింది. కానీ తన ఆస్థిని, వతన్లను, హోదాను ప్రజల కోసం త్యాగం చేసిన అనభేరి ముందు నిజాం ప్రభుత్వం ఆయనకు ఎరగా చూపిన తలుక్దార్ పదవి గడ్డి పోచ అయింది. అనభేరి లొంగకపోవడంతో ప్రభుత్వం ఆయన సభలను నిషేధించింది. ప్రభాకర్ రావు గారిపై నజార్బంద్ జారీ చేయడంతో వారు అజ్ఞాతంలోకి పోవలసి వచ్చింది. అరచేయి అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో అలాగే అనభేరి కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేక పోయింది. భగ భగ మండే ప్రభాకరుడే అయ్యారు అనభేరి. (పెత్తందార్లు తమ ఆటలు సాగక అనభేరిని అడ్డు తొలగించడానికి, నిజాం ప్రభువుకు బంగారు కుర్చీ నజరానాగా ఇచ్చారని ఒక వదంతి కూడా ఉంది).

నిజాంకు సింహస్వప్నంలా మారిన అనభేరిని పట్టించిన వారికి  50 వేల రూపాయల బహుమానం ప్రకటించింది ప్రభుత్వం. కానీ, పేద ప్రజలు సైతం ఆ డబ్బులకు లొంగలేదు. ఆయన ఎలా ఉంటారో తెలియక పోవడంతో నైజాం పోలీసులు నేనే అనభేరి అంటూ ముందుకు వచ్చిన వారిని కాల్చివేయ సాగారు. తమ దేవుడిలా చూసుకొనే అనభేరిని రక్షించుకునేందుకు సామాన్య ప్రజలు డబ్బుల్ని, చివరికి తమ ప్రాణాల్ని సైతం అర్పించడానికి ముందుకు వచ్చారు. 1948 మార్చి14న నిజాం ప్రభుత్వంతో కుమ్ముక్కైన మహ్మదాపూర్ పోలిస్ పటేల్ కుట్రతో అనభేరి దళాన్నిభోజనానికి పిలిచి రజాకార్లకు సమాచారం అందించాడు.

ఒక్కసారిగా రజాకార్లు దాడి చేయడంతో అనభేరి ఊర్లో వార్లకు ప్రాణాపాయం ఉండకూడదని, తమ దళంతో గుట్టల వైపు పరుగెత్తారు. అనభేరికి తప్పించుకొనే అవకాశం ఉండి కూడా ఇప్పటికే తన కోసం ఎంతోమంది ప్రజలు ప్రాణ త్యాగానికి సిద్దం అవుతున్నారని, భరించలేక రజాకార్లతో యుద్దానికే సిద్దం అయ్యారు ఆయన. తన స్టెన్ గన్తో ఫైరింగ్ చేస్తూ ఎంతో మంది రజాకార్లని మట్టి కరిపించిన ఆయన తన ఫ్రెండ్ భూపతి రెడ్డి గాయపడడంతో ఆయనకు ఒక చేత్తో బ్యాండేజ్ చేస్తూ మరో చేత్తో ఫైరింగ్ చేయసాగారు. గాయపడ్డ అనభేరిని రజాకార్లు నీళ్లు ఇచ్చి హాస్పిటల్‌కు తీసుకుపోతం అన్నా కూడా ఆయన వాళ్లిచ్చిన నీరు తాగడానికి కానీ, హాస్పిటల్‌కు పోయి ప్రాణాలు కాపాడుకోవడానికి కానీ ఇష్టపడలేదు.  చనిపోయిన ఆయన కోటును కట్టెకు చుట్టి “షేర్ మర్ గయా “ అంటూ రజాకార్లు అక్కడి ఊర్లన్ని తిరుగుతూ నినాదాలు చేశారు.

అనభేరి మరణంతో ఒక్కసారిగా తెలంగాణ అంతా భగ్గుమంది. ప్రతి ఊర్లోను యువకులు, స్త్రీలు దళాలుగా ఏర్పడి ఉద్యమించారు. ఫలితంగా ఆయన మరణించిన ఆరు నెలల్లోపే తెలంగాణ చెర వీడింది. తెలంగాణ ఉద్యమంలో తొలి సమిధగా మారి, తెలంగాణ విముక్తికి మూలం అయిన అనభేరికి, ప్రభుత్వం ఆయన త్యాగానికి సరైన గుర్తింపు నిస్తుందని, ఆయన స్ఫూర్తి దాయకమైన చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చుతుందని, తెలంగాణకే తలమానికం అయిన తెలంగాణ షేర్/భగత్ సింగ్ అయిన ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై నెలకొల్పుతుందని, ఎంతో మంది చేనేత కార్మికులు, కర్షకులకు జీవం పోసిన ఆయనకు సరైన స్థానం కల్పిస్తుందని, తెలంగాణ ప్రజల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆయన కోసం, తెలంగాణ ఆడపడచుల గౌరవాన్ని కాపాడిన అనభేరి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వ తరఫున నిర్వహించేలా కార్యక్రమాల్ని చేపడుతుందని ఆశిద్దాం. మన తెలంగాణ  ముఖ్యమంత్రి గారికి విన్నవిద్దాం.
(నేడు తెలంగాణ షేర్ అనభేరి ప్రభాకర్ రావు గారి జయంతి సందర్భంగా.....)
- ఉమా సల్వాజి (న్యూజిలాండ్, అనభేరి మనమరాలు)
 

మరిన్ని వార్తలు