అనంత్‌ ‘చరిత్ర’ పాఠాలు

5 Feb, 2020 00:02 IST|Sakshi

నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు తరచుగా కట్టు తప్పుతున్నారు.  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డే అలాంటివారిలో ఒకరు.  పార్టీలో శరవేగంతో ఎదగడానికో...అధినేత దృష్టిలో పడితే ఇప్పుడున్న స్థానాన్ని మించిన అవకాశాలు వస్తాయనో భావించి ఇష్టానుసారం మాట్లాడే నేతలు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. కానీ అనంత్‌కుమార్‌ హెగ్డే ఆ కోవలోకి రారు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకొచ్చినవారు కాదు. ఇప్పటికే ఆరుసార్లు ఎంపీగా పనిచేసినవారు. అలాంటి నాయకుడు బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే, జవాబుదారీతనంతో వ్యవహరించకపోతే కొత్తగా వచ్చే నాయకులకు, సాధారణ ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు పోతాయి. ఆ సంగతి ఆయన గ్రహిస్తున్నట్టు లేరు. ఇంతక్రితం కూడా పలు సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై నిరసనలు పెల్లుబికాయి. ఒకసారైతే నోరు జారారనుకోవచ్చు. కానీ పదే పదే అలాంటి వ్యాఖ్యలు చేస్తే వాటి వెనక నిర్దిష్టమైన ఉద్దేశాలు న్నాయని, ప్రయోజనాలున్నాయని అనుకోవాల్సివస్తుంది. ఆయన తాజాగా దేశ

స్వాతంత్య్రోద్యమం గురించి మాట్లాడారు. మహాత్మా గాంధీ పేరెత్తకుండా, ఆయన్నుద్దేశించే అంటున్నట్టు అందరికీ అర్థ మయ్యేలా నిందాపూర్వకంగా వ్యాఖ్యానించారు. చరిత్ర గురించి, అది తీసుకున్న మలుపుల గురించి అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలని, ఉంటారని ఆశించలేం. అలాగే స్వాతంత్య్రోద్యమంపైనా, దాని తీరుతెన్నులపైనా భిన్నాభిప్రాయం ఉండటం తప్పేం కాదు. ఆ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలోనే షహీద్‌ భగత్‌సింగ్‌ వంటి వారికి గాంధీ అవలంబిస్తున్న విధానాలపై అసంతృప్తి ఉండేది. బలప్రయోగంతో ప్రజల స్వాతంత్య్రేచ్ఛను అణిచివేయాలని చూస్తున్న బ్రిటిష్‌ పాలకులకు అదే భాషలో బదులీయాలని ఆయన వాదించేవారు. నేతాజీ సుభాస్‌చంద్ర బోస్‌ సైతం ఇలాంటి అభిప్రాయంతోనే ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ(ఐఎన్‌ఏ)ను స్థాపించి, యువతీయువకులను సమీకరించారు.

అయితే హెగ్డే అభ్యం తరం పూర్తిగా వేరు. ఆయన దృష్టిలో స్వాతంత్య్రోద్యమంలో రెండు రకాలవారున్నారు. ఆయుధా లతో పోరాడినవారు. మేధోశక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసినవారు. వీరుగాక మరో రకం సమర యోధులున్నారు. ఈ సమరయోధులు బ్రిటిష్‌ పాలకులతో లాలూచీ పడి ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమ సారథులు దాన్నెలా నడపాలో ఎప్పటికప్పుడు బ్రిటిష్‌ వారినుంచి సలహాలు తీసుకునే వారు. పాలకులు చెప్పినట్టల్లా చేస్తామన్న అవగాహనతో, సర్దుబాట్లతో ఆ ఉద్యమం సాగింది. తమ ఉద్యమాన్ని గుర్తించి, తమను అరెస్టు చేసి జైలుకు పంపమని ఈ ఉద్యమ సారథులు పాలకులను వేడుకునేవారు. జైళ్లలో తమను జాగ్రత్తగా చూసుకుంటే చాలని కోరేవారు. ఇలాంటి నాయకులపై బ్రిటిష్‌ పోలీసులు ఒక్కసారి కూడా చేయిచేసుకోలేదు. ఇంతవరకూ ఎవరి గురించి మాట్లాడు తున్నారో స్పష్టత లేకుండా ప్రసంగించిన అనంత్‌కుమార్‌ ఆ తర్వాత కాస్త స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్‌ను సమర్థించేవారంతా ఆమరణ నిరాహార దీక్షల వల్లా, సత్యాగ్రహం వల్లా స్వాతంత్య్రం వచ్చిందని చెబుతుంటారని, కానీ అది పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు.

సత్యాగ్రహం వల్ల బ్రిటిష్‌ పాలకులు ఈ దేశం వదిలిపోలేదని, వారు నిరాశానిస్పృహలకు లోనై స్వాతంత్య్రం ప్రకటిం చారన్నది హెగ్డే అభిప్రాయం. ఇలా స్వాతంత్య్రోద్యమ చరిత్రనంతా ఏకరువు పెట్టాక, ఈ ఉద్యమం నడిపించినవారు మన దేశంలో మహాత్ములయ్యారని వ్యాఖ్యానించారు. నిజంగా ఈ దేశం కోసం పనిచేసి, పెను మార్పులు తీసుకురావడానికి త్యాగాలు చేసినవారిని చరిత్ర చీకటి కోణాల్లోకి నెట్టేశారని ఆవేదన చెందారు. ఎవరికీ తెలియని ఈ చరిత్రనంతా తాను ఎక్కడ అధ్యయనం చేశారో ఆయన చెప్పలేదు. వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ అధినాయకత్వం ఆదేశించాక తన మాటల్ని మీడియా వక్రీకరించిందని ఆయనంటున్నారు.  తాను గాంధీ, నెహ్రూ పేర్లెత్తలేదని చెబుతున్నారు. ఈ దేశంలో స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహ సమరం నడిపిందీ, ఆమరణ దీక్షలు చేసిందీ ఎవరో హెగ్డే చెప్పకపోయి ఉండొచ్చు. అలాగే ఈ ఉద్యమాలు సాగించినవారు మహాత్ములయ్యారన్నప్పుడు కూడా ఆయన ఎవరి పేరూ ప్రస్తావించి ఉండకపోవచ్చు. కానీ స్వాతంత్య్రోద్యమం గురించి ఎంతో కొంత తెలిసినవారికి కూడా ఎవరినుద్దేశించి ఆయన ఆ మాటలన్నారో సులభంగా తెలుస్తుంది. నిజానికి అలా తెలియాలనే ఆయన అంత వివరంగా, అంత ‘స్పష్టంగా’ మాట్లాడారు. కాకపోతే పేర్లు నేరుగా వెల్లడించడానికి ఇంకా సమయం రాలేదని అనుకుని ఉండొచ్చు.

 
‘పెదవి దాటని మాటలకు మనం యజమానులం. పెదవి దాటి బయటకు వచ్చిన మాటలకు మాత్రం మనమే బానిసలవుతామ’ని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. మహాత్ముణ్ణి గుర్తుకుతెచ్చేంతగా వ్యాఖ్యానించిన హెగ్డే...తమ మేధో శక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసిన ఆ మహానుభావులెవరో కూడా స్పష్టంగా చెప్పివుండాల్సింది. అప్పట్లో ఈ దేశంలో పెను మార్పులు తీసుకురావడానికి పాటుబడి, చరిత్ర చీకటికోణాల్లో మగ్గిపోయిన వారెవరో కూడా వివరించి ఉండాల్సింది. ఆయన అలా చేసివుంటే ఈ చర్చ మొత్తం వేరుగా ఉండేది.

అలాగే తన ‘లాలూచీ’ ఆరోపణలకు సమర్థనగా బ్రిటిష్‌ ప్రభుత్వ పత్రాలేమైనా వెల్లడించివుంటే అందరూ సంతోషించేవారు. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ కూడా గత నవంబర్‌లో ఇదేవిధంగా మహాత్మా గాంధీని ఏమనలేదు. కానీ ఆయన్ను పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను దేశ భక్తుడన్నారు. అప్పుడూ ఇప్పుడూ కూడా బీజేపీ మందలించింది. ఆ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని చెప్పింది. స్వాతంత్య్రోద్యమాన్ని పల్చన చేసి, దాని సారథుల్ని కించపరిచి సాధించదల్చు కున్నదేమిటో హెగ్డే చెప్పాలి. తమ పార్టీ వారినుంచే తరచు ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలెందు కొస్తున్నాయో బీజేపీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. 

మరిన్ని వార్తలు