Madhya Pradesh Assembly Elections: మధ్యప్రదేశ్‌ ఎన్నికల బరిలో వృద్ధనేతలు

14 Nov, 2023 08:51 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో వివిధ పార్టీల ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలో  మొత్తం 230 మంది శాసన సభ్యులను ఎన్నుకునేందుకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మధ్యప్రదేశ్‌లోని తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 

క్రియాశీల రాజకీయాల నుంచి వృద్ధ నేతలను తప్పించి, కొత్త తరానికి అవకాశం కల్పిస్తామని, గతంలో బీజేపీ చేసిన తీర్మానం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. పైగా రాష్ట్రంలో 70 ఏళ్లు పైబడిన నేతలకు కూడా ఎ‍న్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం విశేషం. ఈసారి ముగ్గురు కేంద్ర మంత్రులు, ఒక ప్రధాన కార్యదర్శి సహా ఏడుగురు ఎంపీలను పార్టీ  ఎన్నికల బరిలోకి దింపింది. 70 ఏళ్లు పైబడిన 14 మంది అభ్యర్థులను బీజేపీ బరిలోకి దింపింది. 

కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా 70 ఏళ్లు పైబడిన తొమ్మిది మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. మధ్యప్రదేశ్‌లో సత్నా జిల్లాలోని నాగౌడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున రాష్ట్ర మాజీ మంత్రి నాగేంద్ర సింగ్ నాగోడ్ (80), రేవా జిల్లాలోని గుర్ నుంచి నాగేంద్ర సింగ్ (79)లను పార్టీ బరిలోకి దించింది. వీరు బీజేపీలో వృద్ధ నేతలుగా గుర్తింపు పొందారు. 

ఇదిలావుండగా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడు ప్రఖర్ ప్రతాప్ సింగ్‌(25)కు గూడ్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రఖర్‌ రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన అభ్యర్థిగా నిలిచారు. ఈయన ఎన్నికల్లో పోటీచేసేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి వచ్చారు. 
ఇది కూడా చదవండి: ఢిల్లీని బెంబేలెత్తిస్తున్న కాలుష్య స్థాయిలు

మరిన్ని వార్తలు