వంచనాత్మక విన్యాసం!

9 Mar, 2018 02:07 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు షరా మామూలుగా అలవాటైన రాజకీయ క్రీడను నదురూ బెదురూ లేకుండా మరోసారి ప్రదర్శిస్తు న్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజలు నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం సాగిస్తున్న పోరాటాన్ని నీరుగార్చడానికి శాయశక్తులా ప్రయత్నించి భంగపడిన బాబు... చివరికిప్పుడు గత్యంతరం లేని స్థితిలో కేంద్రంలోని తన ఇద్దరి మంత్రులు అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి లతో రాజీనామా చేయించారు. దానికి బోలెడు లీకులిస్తూ రక్తి కట్టించాలని చూశారు.

అంతకన్నా ముందు ఇన్నాళ్లూ తనవల్ల తప్పు జరిగిందని బాబు అంగీక రించి ఉంటే వేరుగా ఉండేది. ఎన్‌డీఏ సర్కారుపై వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ ప్రతిపాదించ దలచిన అవిశ్వాస తీర్మానానికి సహకరిస్తామనో... లేదా తామే అలాంటి తీర్మానం తీసుకొస్తాం మద్దతివ్వమని కోరి ఉంటేనో బాబును ప్రజానీకం పెద్ద మనసుతో క్షమించేవారు. కానీ ఆయనగారు మాత్రం ఆ ఊసే ఎత్తకుండా ఎప్పటిలాగే తన కపటనాటకాన్ని కొనసాగిస్తున్నారు. మంత్రి పదవుల నుంచి తప్పుకుంటారటగానీ ఎన్‌డీఏలో కొనసాగుతారట... ఎన్‌డీఏ సర్కారు వైఖ రికి ఆగ్రహిస్తారటగానీ దానికి యధావిధిగా మద్దతు పలుకుతారట!

రానున్న రోజుల్లో కేంద్రం స్పందన ఎలా ఉంటుందో చూసి తదుపరి చర్య తీసుకుంటారట! ఏమిటీ నయవంచన? 5 కోట్ల మంది ప్రజానీకం జీవన్మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా విషయంలో ఎందుకీ డ్రామాలు? ‘ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతార’న్న నానుడిని నిజం చేస్తూ బీజేపీ సైతం ఇందులో యధోచిత పాత్ర నిర్వహించినట్టు కనబడుతోంది. అటు కేంద్రంలోని టీడీపీ మంత్రులు రాజీనామా చేస్తారని బాబు ప్రకటించగానే తామూ చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. కూడ బలుక్కున్నట్టు ఒకేరోజు ఢిల్లీలోనూ, అమరావతిలోనూ రాజీనామాల పర్వం ముగిసింది. కానీ ‘హోదా ఖేదం’ టీడీపీ నేతల్లోగానీ, రాజీనామాలిచ్చిన కేంద్ర మంత్రుల్లోగానీ మచ్చుకైనా కనబడలేదు.

ఇంతకూ రాజీనామా పర్వంలోని ఆంతర్యమేమిటో బాబు చెప్పగలరా? కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి కేంద్రం చేసిందేమిటో, చేయదల్చుకున్నదేమిటో చెప్పారు. ‘సెంటిమెంటుతో నిధులు రాలవ’ని కుండబద్దలు కొట్టారు. నిరుడు సెప్టెంబర్‌లో తొలిసారి ప్రత్యేక హోదా అసాధ్యమని ప్రకటించిన సందర్భంలో సైతం అరుణ్‌ జైట్లీ ఈ మాదిరి మాటలే అన్నారు. అప్పుడు రాత్రి పదకొండు గంటలు కావొస్తుండగా జైట్లీ మీడి యానుద్దేశించి మాట్లాడితే, సరిగ్గా అర్ధరాత్రి ముహూర్తం చూసుకుని చంద్రబాబు దాన్ని స్వాగతించారు.

అప్పటికీ, ఇప్పటికీ జైట్లీ మాటల్లో ఆవగింజంతయినా తేడా ఉందా? ఆనాడు నచ్చిన ప్రకటన ఇప్పుడు వెగటెందుకైంది? అప్పుడు పడి పడి పొగిడి, ఆయనకు శాలువాలు కప్పి పరవశించిన బాబుకు... ఇప్పుడు అవే మాటలు అవమానంగా ఎందుకనిపిస్తున్నాయి? అసలు తాను కోరుకుంటున్నదే మిటో స్పష్టంగా చెప్పగలరా? హోదా వద్దని 14వ ఆర్ధిక సంఘం చెప్పిందని, అందుకే ఏపీకి ప్యాకేజీ ఇస్తున్నామని జైట్లీ అప్పుడూ, ఇప్పుడూ కూడా తేటతెల్లం చేశారు. రెవెన్యూ లోటు విషయంలోనూ అప్పటి లెక్కలే తిరగేశారు.

అప్పట్లో జైట్లీ ప్రకటన చేశాక ఇక హోదా ముగిసిన అధ్యాయమని బాబు ప్రచారం మొదలెట్టారు. ప్రత్యేక హోదా తాము ఎలాంటి సిఫార్సులూ చేయలేదని ఆర్థిక సంఘం చైర్మన్‌ వేణుగోపాలరెడ్డి, అందులోని ఇతర సభ్యులు వివిధ వేదికలపై పదే పదే చెప్పినా అవి వినబడనట్టే నటించారు. అంతేకాదు... ప్రత్యేక హోదాపై జరిగే సదస్సుల్లో, ఉద్యమాల్లో పాల్గొంటే మీ పిల్లల్ని పీడీ చట్టం కింద జైల్లో పెట్టిస్తానని తల్లిదండ్రుల్ని బెదిరించారు. సదస్సుల నిర్వహణకు చోటు దొరక్కుండా చేయడానికి పోలీసుల్ని ఉసిగొల్పారు. ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధమైన రాగాలు తీస్తున్నారు.

ఇన్నేళ్లుగా ఎన్ని కబుర్లు చెబుతూవస్తున్నా ప్రజల్లో ‘ప్రత్యేక హోదా’ ఆకాంక్ష సజీవంగా ఉండటం గమనించాక, అది రోజురోజుకూ బలం పుంజుకోవడాన్ని గ్రహించాక బాబు వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా గత నెల 13న జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన తాజా కార్యాచరణ చూశాక ఆయనకు కాళ్లూ చేతులూ ఆడలేదు. ఈనెల 1వ తేదీన మొదలైన ఆ కార్యాచరణ తర్వాత అనుకున్నట్టే ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. పార్లమెంటు సమావేశాలు మొదలైన 5 తేదీన ఢిల్లీలో ధర్నా జరిగింది.

ఆనాటినుంచి రోజూ పార్లమెంటు కార్యకలాపాలను వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు స్తంభింపజేస్తున్నారు. జనాగ్రహం దావానలంగా మారి అందులో భస్మంకావడం ఖాయమని అర్ధమయ్యాక ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చాలని, రాజ్యసభలో ఆనాడిచ్చిన హామీలు తీర్చాల’ని బుధవారం అసెంబ్లీలో మాట్లాడి అందరినీ ఆశ్చ ర్యపరిచారు. ఈ మాటలు మాట్లాడే ముందు గతంలో తాను చేసిన ప్రకటనలకు బాబు పశ్చాత్తాపం ప్రకటించి ఉంటే వేరుగా ఉండేది. ఎందుకంటే గత ఏడాది కాలంగా బాబు కేంద్రంనుంచి మనమే ఎక్కువ సాధించామని, మనకే దండిగా నిధులొచ్చాయని, హోదావల్ల అదనంగా ఒరిగేదేమీ ఉండదని ప్రకటనలిచ్చారు. ఢిల్లీలోని టీడీపీ మంత్రులు అదే బాణీ వినిపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ ప్రత్యేక హోదా పాట అందుకుంటున్నారు.

ఉద్యమ ఉధృతిని నీరుగార్చడానికి బాబు ఆడుతున్న కపటనాటకాలను పోల్చుకోలేనంత అమాయకులు కారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. చేసేది వంచనే అయినా అందులో ప్రతిసారీ వైవిధ్యతను ప్రదర్శించడం బాబు ప్రత్యేకత. తనకంటిన ‘ప్యాకేజీ మకిలి’ని చడీచప్పుడూ లేకుండా వదుల్చుకుని రాబోయే ఎన్నికల్లో ‘రహస్య చెలికాడు’ కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు బాబు సన్నాహాలు చేస్తున్నట్టున్నారు. ఎన్ని వేషాలేసినా, స్వరం ఎలా మార్చినా విలువైన ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన వైనం జనం మరిచిపోరు. తమకేది ప్రయోజనమో, దాన్ని సాకారం చేసేదెవరో పోల్చుకుంటారు. రాజీనామా డ్రామాలు వారిని ఏమాత్రం ఏమార్చలేవు.

మరిన్ని వార్తలు