గోప్యతకు పట్టం

25 Aug, 2017 01:40 IST|Sakshi
గోప్యతకు పట్టం

చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. వ్యక్తిగత గోప్యత జీవించే హక్కులో భాగమని, అది పౌరుల ప్రాథమిక హక్కని నిర్ధారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం గురువారం వెలువరించిన తీర్పు అలాంటి సందర్భమే. తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వ్యక్తిగత గోప్యతను కేవలం వ్యక్తి భద్రతకు సంబంధించిన భావనగా పరిమి తార్ధంలో చూడలేదు. దేన్ని ఎంపిక చేసుకోవాలో, దేనికి ప్రాధాన్యమివ్వాలో నిర్ణయించుకునే స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పౌరులకుంటాయని... అలా లేనట్టయితే అసలు మనిషి మనుగడకే అర్ధం లేదని స్పష్టం చేసింది.

పౌరులు జరిపే సమస్త లావాదేవీలకూ ప్రభుత్వాలు ఆధార్‌ను తప్పనిసరిచేయడాన్ని సవాలు చేస్తూ దాఖ లైన పిటిషన్లపై అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపు తుండగా అసలు వ్యక్తిగత గోప్యత అన్నది ప్రాథమిక హక్కా కాదా అన్న అంశం చర్చలోకి వచ్చింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో వ్యక్తిగత గోప్యత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం వాదించగా... జీవించే హక్కులో అది భాగమని, పౌరు లకు గోప్యతనేది లేకుండా జీవించే హక్కుకు అర్ధమేముంటుందని పిటిషనర్లు ప్రశ్నించారు.

దాంతో ఆధార్‌ చెల్లుబాటు సంగతి తేల్చడానికి ముందు ఈ వ్యక్తిగత గోప్యత ఎలాంటి హక్కు అన్నది నిర్ధారించాలని ఆ సమయంలోనే సుప్రీంకోర్టు భావించింది. అందుకనుగుణంగా తొమ్మిదిమందితో కూడిన ధర్మాసనం ఏర్పా టైంది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చేసిన తాజా నిర్ధార ణతో ఇప్పుడు ఆధార్‌ చెల్లుబాటు కేసు ఏమవుతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొన్నది.

కఠిన చట్టాల ద్వారా కార్యనిర్వాహక వ్యవస్థకు సంక్రమించే అధికారాలకూ... పౌరుల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకూ మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు రెండింటిమధ్యా సమతూకం ఉన్నదో లేదో నిర్ధారించడం, రాజ్యాంగదత్తమైన ప్రాథమిక హక్కులు కబ్జాకు గురికాకుండా చూడటం న్యాయవ్యవస్థకు సంక్లిష్టమైన సవాలు. అత్యవసర పరిస్థితి కాలంలో ఆంతరంగిక భద్రతా చట్టం(మీసా)కింద అరెస్టయి జైళ్లలో మగ్గుతున్న పౌరుల తరఫున దాఖలైన పిటిషన్లను దేశంలోని తొమ్మిది హైకోర్టులు అంగీకరించి వారి విడుదలకు ఆదేశాలిచ్చినప్పుడు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రజాస్వామికవాదులను దిగ్భ్రాంతిపరిచింది.

పౌరులను నిరవధికంగా నిర్బంధించడానికి అవకాశమిచ్చే అలాంటి నిరంకుశ చట్టం చెల్లుతుందని 4–1 మెజారిటీతో ఇచ్చిన ఆ తీర్పు తర్వాత సుప్రీంకోర్టు మళ్లీ ఎప్పుడూ అలాంటి తొట్రుపాటుకు లోనుకాలేదు. గత నాలుగు దశాబ్దాల చరిత్రలో సర్వోన్నత న్యాయ స్థానం ప్రతి సందర్భంలోనూ పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రాధాన్య మిచ్చింది. అలాంటి అనేక తీర్పుల్లో గురువారం నాటి తీర్పు విశిష్టమైనదని చెప్పవచ్చు.

వ్యక్తిగత గోప్యతకు రాజ్యాంగపరమైన రక్షణ లేదని 1950లో ఎంపి శర్మ కేసులో ఆరుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. తిరిగి 1960లో ఖరక్‌సింగ్‌ కేసులో సైతం ఎనిమిదిమందితో కూడిన ధర్మాసనం ఆ విధం గానే చెప్పింది. అయితే అనంతరకాలంలో వేర్వేరు సందర్భాల్లో అదే న్యాయస్థానం గోప్యత హక్కును గుర్తించింది. మెజారిటీ సభ్యులిచ్చిన తీర్పుల్ని అంతకన్నా తక్కువమంది న్యాయమూర్తులున్న బెంచ్‌లు ఎలా కాదంటాయన్నది ఆధార్‌ కేసులో కేంద్రం వాదన. అందువల్లే తొమ్మిదిమంది న్యాయమూర్తుల ధర్మాసనం వ్యక్తిగత గోప్యత అంశంపై విచారించాల్సి వచ్చింది.

రాజ్యాంగంలోని ఇతర అధికరణాలతో పోలిస్తే 21వ అధికరణను సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు నిశితంగా పరిశీలించి భాష్యం చెప్పాల్సివచ్చింది. ఆ క్రమంలో ఆ అధికరణ పరిధి విస్తృతమవుతూ వచ్చింది. జీవించే హక్కంటే కేవలం ప్రాణానికి సంబంధించింది మాత్రమే కాదని... గౌరవప్రదంగా జీవించే హక్కు కూడానని మేనకాగాంధీ కేసులో చెప్పింది. అలాగే దోపిడీకి గురికాకుండా ఉండటం, ఆరోగ్యాన్ని పరిరక్షించు కోవడం, ఆరోగ్యకర వాతావరణంలో పిల్లలు పెరగడం, పనిచేసే స్థలాల్లో లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండటం వగైరాలు జీవించే హక్కులో భాగమైంది వేర్వేరు తీర్పుల పర్యవసానంగానే.

వ్యక్తిగత గోప్యతపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై విస్పష్టంగా తన అభిప్రాయం చెప్పలేకపోయింది. అది ప్రాథమిక హక్కా కాదా... ఏమనుకుంటున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ కేహార్‌ అడిగిన సూటి ప్రశ్నకు అటార్నీ జనరల్‌ నేరుగా జవాబివ్వలేదు. గోప్యత ప్రాథమిక హక్కే అనుకున్నా అందులో అనేక రకాలైనవి ఉన్నాయని, ఏ రకమైన గోప్యతను ప్రాథ మిక హక్కుగా పరిగణించవచ్చునన్నది తేల్చాల్సి వస్తుందని చెప్పారు. కానీ ఏ రకమైన గోప్యతనైనా హరించే హక్కు ప్రభుత్వాలకుండదని ఈ తీర్పు స్పష్టం చేసినట్టయింది.

ఇది ఒక్క ఆధార్‌కు మాత్రమే కాదు... ప్రస్తుతం స్వలింగ సంప ర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీలోని సెక్షన్‌ 377 వంటివి ఈ తీర్పు వెలుగులో న్యాయస్థానాలు సమీక్షించే అవకాశం ఉంది. సెక్షన్‌ 377 రాజ్యాంగబద్ధమైనదేనని నాలుగేళ్లక్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తాజా తీర్పు ఆధారంగా దాన్ని మరో సారి సవాల్‌ చేసే అవకాశం లేకపోలేదు. అంతేకాదు... అనుమానితుల పేరిట పౌరుల్లో ఎవరి డీఎన్‌ఏ నమూనాలనైనా, వేలిముద్రలనైనా సేకరించడానికి ప్రభు త్వాలకు అధికారం కట్టబెట్టే డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ ముసాయిదా బిల్లు చట్టమైతే దాని చెల్లుబాటును కూడా 21వ అధికరణ గీటురాయిగా సమీక్షించే అవకాశం ఉంది.

మన సమాజం ఉన్నత స్థితికి చేరుకోవాలన్న సదాశయంతో రూపొందిన రాజ్యాం గంలో అన్నింటినీ ముందే ఊహించి పొందుపర్చడం సాధ్యంకాదు. మొత్తంగా ఆ స్ఫూర్తిని పరిరక్షించడం, దాన్ని సృజనాత్మకంగా అన్వయించి విస్తృతపరచడం న్యాయస్థానాల కర్తవ్యం. ఆ కృషిలో మన న్యాయస్థానాల పాత్ర ప్రగతిశీలమైనదని తాజా తీర్పు మరోసారి ధ్రువపరిచింది.

మరిన్ని వార్తలు