‘సౌర’ తుఫానులో చాందీ

30 Jan, 2016 01:51 IST|Sakshi
‘సౌర’ తుఫానులో చాందీ

కేరళకు ఎన్నికలూ, కుంభకోణాలూ జంటకవుల్లా వస్తుంటాయి. దాదాపు రెండున్న రేళ్లుగా రాష్ట్రంలో చర్చనీయాంశమై న్యాయవిచారణ కొనసాగుతున్న సోలార్ కుంభకోణం... మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న దశలో యూడీఎఫ్ సర్కారుకు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మెడకు చుట్టుకుంది. ఈ స్కాంలో ఊమెన్ చాందీపై ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని విశ్వసించిన విజిలెన్స్ కోర్టు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గురువారం ఆదేశించింది.

తాను సీఎంకు రూ. 1.90 కోట్ల ముడుపులిచ్చానని ఈ స్కాంలో ప్రధాన నిందితురాలైన సరితా ఎస్. నాయర్ న్యాయ విచారణ కమిషన్ ముందు చెప్పిన మర్నాడే విజిలెన్స్ కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. అయితే 24 గంటలు గడవకుండానే శుక్రవారం ఊమెన్ చాందీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ స్టే ఉత్తర్వులు రెండు నెలలపాటు అమల్లో ఉంటాయని హైకోర్టు న్యాయమూర్తి చెప్పాక ‘న్యాయమే గెలిచింద’ని చాందీ ప్రకటించినా ఈ కేసును వదుల్చుకోవడం ఆయనకంత సులభం కాదు. కేవలం సాంకేతిక కారణాలతో మాత్రమే ఈ స్టే ఉత్తర్వులొచ్చాయి తప్ప స్కాంలో నిజానిజాలేమిటో హైకోర్టు నిర్ధారించలేదు.

రెండు నెలల తర్వాత ఆయన అప్పీల్ విచారణకొచ్చినప్పుడు కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని భావిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో ఉంటాయి గనుక చాందీకి సమస్యలు ఎదురుకావొచ్చు. నిజానికి చాందీ ఇప్పటికే ఇందులో పీకల్లోతు మునిగిపోయారు. చాందీ ప్రమేయంలోని నిజానిజాల సంగతలా ఉంచి నైతిక కారణాలతోనైనా ఆయన్ను రాజీనామా చేయించకపోతే ఎలా అన్న మీమాంసలో కాంగ్రెస్ పడింది. బహుశా హైకోర్టు స్టే ఉత్తర్వులు రాకపోతే చాందీని ఈపాటికే ఇంటికి పంపవలసివచ్చే దేమో! బార్ యజమానుల నుంచి ముడుపులు స్వీకరించారన్న ఆరోపణపై విజిలెన్స్ కోర్టు గత వారం మంత్రి కె. బాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశిస్తే వారం గడిచాక హైకోర్టు ఆ ఉత్తర్వులపై ఇదే మాదిరి స్టే ఇచ్చింది. కానీ ఈలోగా ఆయన రాజీనామా చేయకతప్పలేదు.

బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం లాంటి లక్ష కోట్ల నిడివి దాటిన స్కాంల గురించి కథలు కథలుగా విన్న జనానికి రూ. 7 కోట్లు మించని ఈ సోలార్ స్కాం చిల్లర కుంభకోణంగా కనిపించవచ్చు. అయితే ఎన్నికలు ఆగమిస్తున్న వేళ కుంభకోణం చిన్నదా, పెద్దదా అన్న అంశానికి ప్రాధాన్యత ఉండదు. పైగా ఇందులో డబ్బుతోపాటు మహిళలను ఎరవేయడమనే అంశం కూడా చేరడంతో దీనికి భారీ ప్రచారం లభిస్తోంది. దానికితోడు ఈ స్కాంకి సంబంధించి ఆడియో, వీడియో టేపులు ఉన్నాయని గుప్పుమనడంతో అందరి దృష్టీ ఈ కేసుపైనే పడింది.  దీని పూర్వాపరాలు ఆసక్తి కలిగించేవే. టీం సోలార్ రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ పేరిట తన జీవన సహచరుడు బిజూ రాధాకృష్ణన్‌తో కలిసి సరితా నాయర్ ఒక కంపెనీ స్థాపించారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాముల్ని చేస్తామని పలుకుబడి గల వ్యక్తులనుంచి రూ. 7 కోట్లు సేకరించారు. అందుకు సీఎం ఊమెన్ చాందీ పేరు వాడుకున్నారు. సోలార్ యూనిట్లు అందజేస్తామని ఆశపెట్టి జనంనుంచి ముందస్తుగా డబ్బు కట్టించుకున్నారు. పనిలో పనిగా ఇద్దరు మహిళలను వినియో గించుకుని పలువురు అధికారులకూ, వారి ద్వారా మంత్రులకూ, సీఎం కార్యాల యంలోనివారికీ సన్నిహితమయ్యారు. చివరకు ఊమెన్ చాందీని సైతం ఇందులో దించగలిగారు.

నేరుగా ఆయనను కలిసి తమ ప్రాజెక్టుకు అవసరమైన మద్దతు పొందగలిగారు. ఈలోగా తనకు అందజేస్తానన్న సోలార్ యూనిట్ ఇవ్వకుండా కంపెనీ మొహం చాటేస్తున్నదంటూ ఒక వినియోగదారుడు కేసు పెట్టడంతో ఈ వ్యవహారమంతా భళ్లున బద్దలయింది. తమ చుట్టూ తిరుగుతున్న సరితా నాయర్, ఆమె ప్రతినిధులు ఉత్త వంచకులని అందరికీ అర్ధమయ్యేసరికి మీడియాలో ఈ స్కాం మార్మోగింది. వెనువెంటనే ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. చివరకు న్యాయ విచారణకు ఆదేశించక తప్పలేదు. ఈ స్కాంతో తనకు సంబంధమే లేదని చాందీ చెబుతున్నారు. మద్య నిషేధం విధించాక బార్ యజమానులు తనపై కక్షగట్టి ఇందులో ఇరికించడానికి చూస్తున్నా రని ఆయన అంటున్నారు. ఈ స్కాంలోని ప్రధాన నిందితురాలు సరితా నాయర్ విచారణ కమిషన్‌కు వెల్లడిస్తున్న విషయాలు పెను సంచలనం కలిగిస్తున్నాయి. ఆమె ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ముఖ్యమంత్రికి ముడుపులిచ్చానన్న నోటితోనే విపక్షంగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ నేతలనూ ఇరకాటంలో పడేశారు. చాందీపై నేరుగా ఆరోపణలు చేస్తే, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే రూ. 10 కోట్లు ఇస్తామని 2014లో సీపీఎం నేతలు ఆశజూపారని కూడా అన్నారు. తన సోలార్ ఎనర్జీ కంపెనీకి సబ్సిడీలు, ఇతర లాభాలూ పొందవచ్చునన్న ఉద్దేశంతో చాందీకి రూ. 1.90 కోట్లు, విద్యుత్ మంత్రిగా ఉన్న మహమ్మద్‌కు రూ. 40 లక్షలు ఇచ్చానని ఆమె చెప్పారు.

అంతేకాదు... చాందీ కుమారుడు చాందీ ఊమెన్‌ను కూడా ఆమె ఈ స్కాంలోకి లాగారు. ఒక మహిళతో కలిసి అతను పశ్చిమాసియాకు యాత్రలు చేశాడని వెల్లడించారు. తనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అత్యాచారానికి పాల్ప డ్డారని ఆరోపించారు. సరితా నాయర్‌తో సీఎంఓలోని ముఖ్య అధికారులతోపాటు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన ఇద్దరు, కేరళకు చెందిన యూడీఎఫ్ నాయకులు... మొత్తంగా 30మంది తరచు మాట్లాడేవారని ఆమె కాల్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆమె జీవన సహచరుడు బిజూ రాధాకృష్ణన్ గత నెలలో ఇదే కమిషన్ ముందు... సీఎంకు తాను రూ. 5.5 కోట్లు ఇచ్చానని వెల్లడించారు. భార్యను హత్య చేసిన కేసులో ఆయన ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ కాంగ్రెస్‌కూ, పాలక యూడీఎఫ్‌కూ కష్టకాలమే. దీన్ని ఊమెన్ చాందీ ఎలా అధిగమించగలరో చూడాల్సి ఉంది.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా