కాప్‌ దిశ ఎటువైపు..?

2 Dec, 2023 00:26 IST|Sakshi

ఏటా తప్పనిసరి లాంఛనంగా జరిగే కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)–28 సదస్సు శుక్రవారం మొదలైంది. ఈనెల 12 వరకూ జరగబోయే ఈ సదస్సుకు 130 మంది దేశాధినేతలు, దాదాపు 80,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. అలా చూస్తే  ఈ సదస్సు గత సమావేశాలతో పోలిస్తే విస్తృతమైనదే. కానీ చివరాఖరికి ఇది ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోగలదా లేక గత సదస్సుల మాదిరే ఉస్సూరనిపిస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న.

లక్ష సంవత్సరాల వ్యవధిలో జరగాల్సిన వాతావరణ మార్పులు కేవలం గత వందేళ్లలో సంభవించాయన్న చేదు వాస్తవాన్ని గుర్తించి చిత్తశుద్ధితో కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమించాల్సిన సంపన్న దేశాలు మాటలతో కాలక్షేపం చేసి లక్ష్యానికి తిలోదకాలిస్తున్నాయి. భూమాత తన భవిష్యత్తును పరిరక్షించమంటూ మనవైపు చూస్తున్నదని, ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించి విజయం సాధించటం మనందరి కర్తవ్యమని సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అర్థవంతమైనది.

2030 కల్లా కర్బన ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించటంతో పాటు హరిత ఇంధనాల వాడకం వాటాను 50 శాతానికి పెంచాలని భారత్‌ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పటం కూడా మెచ్చదగ్గదే. అయితే ప్రధాన కాలుష్య కారక దేశాలైన చైనా, అమెరికా, ఇతర సంపన్న దేశాలూ ఏం చేయ బోతున్నాయన్నదే ప్రధానం. శిలాజ ఇంధనాల అవసరం లేని భవిష్యత్తును నిర్మించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ దేశాధినేతలకు విన్నవించారు గానీ వినేదెవరు? వాతావరణ మార్పులు ఎలా వున్నాయో వివిధ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడెనిమిది దశాబ్దాలుగా కనీవినీ ఎరుగని ఉష్ణోగ్రతలను ఈ ఏడాది చవిచూశామని వాతావరణ పరిశోధకులు అంటున్నారు.

ఇది ఏ స్థాయిలో వున్నదంటే పనామాలో కరువుకాటకాలు విస్తరిల్లి  పసిఫిక్, అట్లాంటిక్‌ మహా సముద్రాలను అనుసంధానించే 80 కిలోమీటర్ల పనామా కాలువకు నీటి పరిమాణం గణనీయంగా తగ్గింది. దాంతో ఆ కాల్వమీదుగా వెళ్లే నౌకల సంఖ్య 40 నుంచి 32కు తగ్గింది. అంతేకాదు... నౌకలు మోసు కెళ్లే సరుకుల బరువుపై కూడా పరిమితులు విధించారు. పర్యవసానంగా సరుకు రవాణా బాగా దెబ్బ తింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదంతా చవిచూసిన కార్చిచ్చులు, వరదలు అన్నీ ఇన్నీ కావు. ఈసారి భారీవర్షాలతో మన దేశం 1,500 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టాన్ని చవిచూసింది.

లిబియానూ, మెక్సికోనూ కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేస్తాయి. నిజానికి ఈ పరిస్థితులను సమీక్షించి, సరైన నిర్ణయాలు తీసుకో వటానికి కాప్‌ వంటి వేదికలు తోడ్పడాలి. ఆచరణలో అది సాధ్యం కావటం లేదు. ఉష్ణోగ్రతల పెరు గుదలను పారిశ్రామికీకరణకు ముందునాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేరకు పరిమితం చేయాలంటే అన్ని రకాల శిలాజ ఇంధనాల వాడకాన్నీ నిలిపేయటం తప్ప తగ్గించటంవల్ల ఒరిగేదేమీ లేదన్నది పర్యావరణవేత్తల మాట.

కానీ సంపన్న దేశాలు నిలకడగా ఒక మాట మీద ఉండటం, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటం ఇంతవరకూ లేనేలేదు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు చేదు వాస్తవమని పర్యావరణపరంగా జరుగుతున్న పెను మార్పులు రుజువు చేస్తున్నాయని, తక్షణం కర్బన ఉద్గారాలను ఆపటంలో విఫలమైతే మహా విపత్తు తప్పదని ఇదే సదస్సులో మాట్లాడిన బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3 చెప్పారు. కానీ విషాదమేమంటే బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ గత ప్రభుత్వాల వాగ్దానాలను బుట్టదాఖలు చేస్తూ పెట్రోల్, డీజిల్‌ కార్ల విక్ర యాలకున్న గడువును 2030 నుంచి 2035కు పొడిగించారు. 2035 నాటికి కొత్త గ్యాస్‌ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కనబెట్టారు.

ఒకే దేశం భిన్న వైఖరులను ప్రదర్శించటం పర్యావరణ పరిరక్షణకు ఏమేరకు దోహదపడుతుందో చార్లెస్‌–3, సునాక్‌లు ఆలోచించాలి. అసలు శిలాజ ఇంధనాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో వున్న దేశాల్లో ఒకటైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో కాప్‌ సదస్సు నిర్వహించటం, సదస్సు అధ్యక్ష స్థానంలో వుండటం ఒక విచిత్రం. నిరుడు ఈజిప్టులో కాప్‌ సదస్సు జరిగింది. అప్పటినుంచీ శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజవాయు ఉత్పత్తులు రికార్డు స్థాయికి చేరాయని గణాంకాలు చెబుతున్నాయి.

మొత్తం ఉత్పత్తుల్లో చమురు వాటా 40 శాతం కాగా, బొగ్గు ఉత్పత్తి వాటా 31 శాతం. మిగిలిన 29 శాతం సహజవాయు ఉత్పత్తులది. వీటిని ఒకేసారి పూర్తిగా తగ్గించుకోవటం సాధ్యపడదు గానీ, ఒక క్రమ పద్ధతిలో హరిత ఇంధనాల వైపు మొగ్గటం ప్రారంభిస్తే లక్ష్యసాధన సులభం అవుతుంది. కానీ ఆ దిశగా ఏ దేశమూ చర్యలు తీసుకోవటం లేదు. నిరుడు ప్రపంచదేశాలు శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం ఏడు లక్షల కోట్ల డాలర్ల సొమ్మును వినియోగించాయని ఒక అంచనా. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచటం విషయంలో ఈసారైనా కాప్‌ దృష్టి సారించాలి. లేనట్టయితే పర్యావరణ విధ్వంసం మరింత పెరగటం ఖాయం.

ఇందుకు అవసరమైన సాంకేతికతలను వెనకబడిన దేశాలకు చవగ్గా అందించటంలో సంపన్న దేశాలు విఫలమవుతున్నాయి. ఇది సరికాదు. నిపుణుల మాట వినటం, పారిస్‌ ఒడంబడిక అమలుకు  నిర్దిష్ట కార్యాచరణ రూపొందించి చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయటం తక్షణావసరం. ఒడంబడిక లక్ష్యాలను విస్మరించిన దేశాలపై ఎలాంటి చర్యలుండాలో నిర్ణ యించాలి. ప్రపంచంలో ఏమూల పర్యావరణానికి విఘాతం కలిగినా అది అన్ని దేశాలకూ ముప్పు కలిగిస్తుందని అందరూ గుర్తించాలి. కాప్‌ సదస్సు ఈ స్పృహను కలిగించగలిగితే దాని లక్ష్యం ఏదోమేరకు నెరవేరినట్టే. 

మరిన్ని వార్తలు