ఆకలిరాజ్యం!

28 Jul, 2018 00:46 IST|Sakshi

ఇరవై రోజుల్లో దేశమంతా 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతుండగా, ఎక్కడో మారుమూల కాదు... దేశ రాజధాని నగరంలో ముగ్గురు చిన్నారులు పట్టెడన్నం దొరక్క ఆకలికి మాడి మృత్యువాత పడ్డారు. ఈ దుర్వార్త చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇంతగా అభివృద్ధి సాధించిన ఈ దశలో కూడా ఇలాంటి చావులా అని దిగ్భ్రాంతికలగొచ్చు. కానీ న్యూఢి ల్లీలో జరగటం వల్లా... ఒకే కుటుంబంలో ముగ్గురు పసివాళ్లు ప్రాణాలు కోల్పోవటంవల్లా ఈ ఉదంతానికి ప్రాధాన్యత వచ్చిందిగానీ దేశంలో ఈ తరహా మరణాలు సంభవించని రోజంటూ లేదని సామాజిక కార్యకర్తలు చెబుతున్న మాట. నిరుడు అక్టోబర్‌లో విడుదలైన ప్రపంచ ఆకలి సూచీలో 119 దేశాల జాబితా ఉంటే అందులో మన స్థానం 100. మనకన్నా పొరుగునున్న బంగ్లా దేశ్‌(88), శ్రీలంక(84), మయన్మార్‌(77), నేపాల్‌(72) ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఒక్క పాకిస్తాన్‌ మాత్రం మనకంటే కాస్త వెనకబడి ఉంది. ఎక్కడైనా ఆకలిచావులు సంభవించాయని వార్తలొస్తే మన ప్రభుత్వాలు చాలా నొచ్చుకుంటాయి.

ఆకలితో కాదు... అనారోగ్యంతో మరణించారని తేల్చ డానికి ప్రయాసపడతాయి. నిరుడు జార్ఖండ్‌లో పదకొండేళ్ల బాలిక సంతోషి చనిపోయినప్పుడు, ఆ రాష్ట్రంలోనే అంతక్రితం 58 ఏళ్ల సావిత్రిదేవి మరణించినప్పుడు అక్కడి ప్రభుత్వం అవి ఆకలి చావులు కాదు... అనారోగ్యం చావులని వాదించింది. అందుకు పోస్టుమార్టం నివేదికలను సాక్ష్యా లుగా చూపింది. ఒక్క జార్ఖండే కాదు... ఏ రాష్ట్రమైనా ఆ పనే చేస్తోంది. కానీ నిండా పదేళ్లు కూడా లేని ముగ్గురు పిల్లలూ న్యూఢిల్లీలో ప్రభుత్వాలకు ఆ అవకాశం ఇవ్వలేదు. రెండోసారి పోస్టుమార్టం చేయించినా వారి కడుపులు, పేగులూ పూర్తిగా ఖాళీగా ఉన్నాయని తేలింది. తన నలభైయ్యేళ్ల సర్వీసులో ఈ మాదిరి కేసుల్ని ఎప్పుడూ చూడలేదని పోస్టుమార్టం చేసిన వైద్యుడు అన్నాడంటే ఆ పిల్లలు మృత్యువాత పడేముందు అనుభవించిన వేదన ఎటువంటిదో ఊహించుకోవచ్చు.

కనీసం ఎనిమిది రోజులనుంచి వారికి తిండి నీళ్లూ లభించలేదని చెబుతున్నారు. తాను అద్దెకు తెచ్చుకున్న రిక్షాను ఎవరో దొంగిలించుకపోవడంతో వారి తండ్రి దిక్కుతోచక, పూట గడవటానికి పని వెతు క్కుంటూ ఎటో వెళ్లాడని స్థానికులు అంటున్నారు. ఆ పిల్లల్ని సాకి కాపాడాల్సిన అమ్మ మతి స్థిమితం తప్పి తన లోకంలో ఉండిపోయింది. పిల్లల మృతదేహాలను తరలిస్తూ ఆసుపత్రి సిబ్బంది తల్లిని కూడా వెంటబెట్టుకు వెళ్తుంటే ‘ఇంత అన్నముంటే పెట్టండ’ంటూ ఆ పిచ్చితల్లి ప్రాథేయ పడింది. పెద్ద పాప వయసు ఎనిమిదేళ్లు దాటలేదు. రెండో పాపకు నాలుగేళ్ల వయసుంటే ఆఖరి చిన్నారికి రెండేళ్లు. 

మనం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నామని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వాలు తరచుగా వృద్ధి రేటును ఉదహరిస్తాయి. ఇంతమందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి బయటపడేశామని ఏటా లెక్కలు ఏకరువు పెడతాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే తామెంత సాధించామో ఘనమైన వాణిజ్య ప్రకటనలతో సమ్మోహనపరిచే ప్రయత్నం చేస్తాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక లెక్క ప్రకారం మన దేశ జనాభాకంతటికీ ఏడాది పొడవునా కడుపు నిండాలంటే దాదాపు 23 కోట్ల టన్నుల ఆహారం అవసరం.

కానీ నిరుడు మన ఆహార దిగుబడి దాదాపు 27.5 కోట్ల టన్నులు. అంటే నాలుగున్నర కోట్ల టన్నుల మిగులు సాధిస్తున్నాం. అయినా ఈ దేశంలో ఆకలిచావులు నిత్యకృత్యమవుతు న్నాయి. రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సంభవిస్తున్న ఆకలిచావుల్లో చాలా భాగం లెక్కకు రావు. మీడియా దృష్టి పడి హడావుడి జరిగినప్పుడు వ్యాధుల కారణంగా మరణించారని చెప్ప డానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. సాధారణంగా ఆకలికి తాళలేనప్పుడు ఒంట్లో సత్తువ తగ్గినప్పుడు విజృంభించే వ్యాధులు ప్రభుత్వాలకు అక్కరకొస్తాయి. మన దేశంలో అంతా బాగానే ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వాలు అనేక ఏర్పాట్లు చేసుకున్నాయి. బడికొచ్చే పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం ఉంది.

ఆరేళ్లలోపు పిల్లలకు, గర్భిణులకు, పిల్లల తల్లులకు పౌష్టికాహారం అందించడానికి అంగన్‌వాడీలున్నాయి. ఇవిగాక బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు వగైరాలు చవగ్గా అందించడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ఉంది. వీటిన్నిటికీ మించి అయిదేళ్ల క్రితం మన దేశం ఆర్భాటంగా అమల్లోకి తెచ్చిన ఆహార భద్రతా చట్టం ఉంది. ఇన్ని ఉండగా తలాబ్‌ చౌక్‌ ప్రాంతానికి వీటిలో ఏ ఒక్కటీ ఎందుకు పోలేదు? ఆ పిల్లల కుటుంబానికి మాత్రమే కాదు... ఆ చుట్టుపక్కల ఉండే చాలా కుటుంబాలకు ఆధార్‌ కార్డు లేదు, రేషన్‌ కార్డు లేదు.

కార్డు కావాలని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఏదైనా బిల్లు తీసుకురమ్మంటున్నారని అక్కడివారు ఫిర్యాదు చేస్తున్నారంటే మన ప్రభుత్వాలు ఏరకంగా పనిచేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సమస్త అవసరాలకూ పనికొస్తుందని నమ్మించి ఆధార్‌ను తీసుకొచ్చినా అది ఉంటే చాలదు... బిల్లులు కావాలని ప్రభుత్వ కార్యా లయాలన్నిటా అడుగుతారు. ఎక్కడో బెంగాల్‌నుంచో, బిహార్‌నుంచో పొట్టపోసుకోవడానికొచ్చిన కుటుంబాలకు ఇవన్నీ అసాధ్యం గనుక ఏ పథకంలోనూ వారు చేరే అవకాశం ఉండదు. ఏతావాతా సంక్షేమ పథకాలన్నీ కాగితాల్లో నిక్షిప్తమై ఉంటే... సాధారణ పౌరులు ఆకలితో నకనకలాడతారు.

ప్రపంచంలో ఇంత అసంబద్ధంగా, ఇంత అన్యాయంగా నడిచే వ్యవస్థలు మరెక్కడా ఉండవు. అయిదేళ్లలోపు పిల్లల్లో సంభవించే సగం మరణాలకు ప్రధాన కారణం పౌష్టికాహారలోపమేనని ఈమధ్యే యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల మరణానికి కారణం మీరంటే మీరని ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ వాదించుకుంటున్నాయి. కానీ నిరుపేద కుటుంబాలకు తగిన గుర్తింపు కార్డులిచ్చి వారికి మెరుగైన ఆహారం, వసతి, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావటం ఎలా అన్న అంశంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నిరర్ధకమైన వాగ్యుద్ధాలకు స్వస్తి చెప్పి సామాజిక సంక్షేమ పథకాలు లక్షిత వర్గాలకు చేరేందుకు అవసరమైన కార్యాచరణ రూపొం దించటం తక్షణావసరమని పాలకులు గుర్తించాలి.

మరిన్ని వార్తలు