South Asia Pollution: దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు?

18 Nov, 2023 13:24 IST|Sakshi

శీతాకాలం రాగానే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా దేశంలోని అనేక నగరాలు వాయు కాలుష్యానికి లోవుతుంటాయి. పొగ మంచు దుప్పటిలో దూరిన విషపూరిత వాయు కాలుష్యం ప్రజల జీవనాన్ని అవస్థలపాలు  చేస్తోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. అయితే చలికాలంలో కాలుష్యం అంతలా ఎందుకు తీవ్రమవుతుందని,  దీని ప్రభావం దక్షిణాసియాపైనే ఎందుకు అధికంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 

నిపుణుల అభిప్రాయం ప్రకారం గత రెండు దశాబ్దాలలో దక్షిణాసియా ప్రాంతంలో వేగంగా పారిశ్రామికీకరణ జరిగింది. ఆర్థికాభివృద్ధి ఊపందుకుంది. జనాభా కూడా అంతే వేగంగా పెరిగింది. వీటన్నింటి కారణంగా డీజిల్,పెట్రోల్, ఇతర ఇంధన వనరుల వినియోగం అత్యధికం అయ్యింది. ఫలితంగా కాలుష్య స్థాయి కూడా పెరిగింది. 

వీటన్నింటికీతోడు దక్షిణాసియాలో దారుణమైన కాలుష్యం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శీతాకాలపు కాలుష్యానికి అతిపెద్ద కారణం పంజాబ్, హర్యానాలో రైతులు పంటలను కాల్చడం. ఈ ప్రాంతంలో 38 శాతానికి పైగా కాలుష్యం వరి పొలాల్లోని వృథా గడ్డిని కాల్చడం కారణంగానే ఏ‍ర్పడుతోంది. దీనికితోడు గత కొన్నేళ్లుగా ఢిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి నుంచి వెలువడే పొగ కూడా కాలుష్యానికి కారణంగా నిలుస్తోంది. 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీ రోడ్లపై దాదాపు 80 లక్షల వాహనాలు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మందికి 472 వాహనాలు ఉన్నాయి. అంటే ఢిల్లీలో ప్రతి ఇద్దరికి సగటున ఒక వాహనం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక పద్ధతులను అవలంబిస్తున్నప్పటికీ అవేవీ తగినంతగా లేవని తేలింది. భారతప్రభుత్వం హరిత ఇంధనాలపై దృష్టి సారించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్నాహాన్ని అందిస్తోంది. అయినా కాలుష్య నియంత్రణకు అడ్డుకట్ట పడటం లేదు.

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దక్షిణాసియాలోని ప్రధాన నగరాల్లో కాలుష్య సమస్య నుండి బయటపడటం కష్టమైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం విధాన రూపకర్తలు తమ సంకల్ప శక్తిని ప్రదర్శించాలంటున్నారు. ప్రభుత్వాలు స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను రూపొందించాలని, వ్యవసాయం, ఇతర కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తగిన విధంగా పారవేయాలని సూచిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: పా​క్‌కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత?

మరిన్ని వార్తలు