11 Oct, 2018 00:33 IST|Sakshi

ప్రకృతి ఎంతగా హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ ఇష్టానుసారం విధ్వంసాన్ని కొనసాగిస్తున్న మానవాళికి ఐక్యరాజ్యసమితి వాతావరణ అధ్యయన బృందం(ఐపీసీసీ) వెల్లడించిన అంశాలు కను విప్పు కలిగించాలి. రానున్న రోజుల్లో భూతాపం వల్ల మన కోల్‌కతా నగరం, పాకిస్తాన్‌ నగరం కరాచీ చండప్రచండమైన ఎండల్ని, వడగాలుల్ని చవిచూస్తాయని ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక హెచ్చ రించింది. సకాలంలో సరైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడకపోతే కోట్లాదిమంది జీవితాలు అస్త వ్యస్థమవుతాయని వివరించింది. ఒకటిన్నర దశాబ్దాల క్రితం అంకురార్పణ జరిగిన పారిశ్రామికీ కరణ సమస్త సహజ వనరుల్నీ పీల్చి పిప్పి చేస్తోంది. బొగ్గు నిల్వల వాడకం, శిలాజ ఇంధనాల వాడకం విచ్చలవిడిగా పెరిగి వాతావరణం అంతకంతకు నాశనమవుతోంది. దీన్నిలాగే కొనసాగ నిస్తే మున్ముందు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో ఐపీసీసీ తెలిపింది. 2030నాటికి ఉష్ణోగ్రత 1.5–2 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే విధ్వంసం ఎంత తీవ్రంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపింది.
 
ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కదిలితే, పర్యావరణ హిత చర్యలకు నడుం బిగిస్తే 2030నాటికి దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని, ఆరున్నరకోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, వాయు కాలుష్యం వల్ల కలిగే లక్షలాది మరణాలను అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుందని గత నెలలో ఆర్థిక, వాతావరణ విషయాల అంతర్జాతీయ సంస్థ (జీసీఈసీ) తెలియజేసింది. శిలాజ ఇంధనాల వినియోగంపై ఆధారపడే ప్రస్తుత స్థితిని మార్చుకోగలిగితే ఎన్నో లాభాలుంటాయని గణాంక సహితంగా వివరించింది. ఇప్పుడు ఐపీసీసీ నివేదిక చూశాకైనా దేశాలన్నీ ఆ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని తెలుస్తుంది. 1992లో జరిగిన తొలి ధరిత్రీ సదస్సు పర్యావరణానికి జరుగుతున్న హానిని, దాని పర్యవసానంగా ఏర్పడే దుష్పరిణా మాల్ని వివరించి అందరిలోనూ చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత 1997లో క్యోటో ప్రోటోకాల్‌ సాకారమైంది. అయితే కర్బన ఉద్గారాలకు నిర్దిష్ట వ్యవధిలో కోత పెట్టి, కాలుష్య నియంత్రణ సాంకే తిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు అందుబాటులోకి తెస్తామని ధనిక దేశాలు అంగీకరించినా అప్పట్లో అమెరికా దాన్ని తోసిపుచ్చింది. నిజానికి ప్రపంచంలో అందరికన్నా అధికంగా, విచ్చలవి డిగా సహజ వనరుల్ని వాడేది అమెరికాయే.

ఆ తర్వాత 2009లో జరిగిన కోపెన్‌ హాగన్‌ సదస్సు నాటికి అది కళ్లు తెరుచుకున్నదన్న అభిప్రాయం కలిగించింది. అప్పటి అధ్యక్షుడు ఒబామా తాము సైతం పర్యావరణ పరిరక్షణకు అంకితమవుతామని ప్రకటించారు. 2005 స్థాయి కర్బన ఉద్గారాల్లో 2020కల్లా 17 శాతం, 2030కల్లా 42 శాతం, 2050నాటికి 83 శాతం తగ్గిస్తామని ఆ దేశం సంసిద్ధత వ్యక్తపరిచింది. 2015లో పారిస్‌ శిఖరాగ్ర సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపుపై 200 దేశాల మధ్య ఒడంబడిక కుదిరింది. 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33 నుంచి 35 శాతాన్ని 2030కల్లా తగ్గించాలని ఆ ఒడంబడిక సారాంశం. దాన్ని సాధించగలిగితే 2050నాటికి భూతాపం పెరుగుద లను కనీసం 1.5 – 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ స్థాయికి పరిమితం చేయగలమని ఆ సదస్సు అంచనా వేసింది. ఆ ఒడంబడిక అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాల నిర్ధారణకు, వివిధ దేశాలు అప్పట్లో హామీ ఇచ్చిన లక్ష్యాల సాధనలో ఇవి ఏవిధంగా తోడ్పడగలవో అంచనా వేయడానికి నిరుడు జర్మనీలోని బాన్‌లో కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌)–23 సదస్సు కూడా జరిగింది. అయితే నిర్దిష్టమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఆ సదస్సు విఫలమైంది. దానికి కొనసాగింపుగా వచ్చే డిసెంబర్‌లో పోలాండ్‌లోని కటోవైస్‌లో కాప్‌–24 సదస్సుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కానీ అక్కడ ఈ దేశాలన్నీ ఏం సాధించగలవో అనుమానమే.
  
మొత్తానికి 2020నాటికల్లా పారిస్‌ ఒడంబడిక అమలు ప్రారంభం కావాలని సంకల్పం చెప్పు కున్నా ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. ఒక్క అమెరికా మాత్రమే కాదు... మిగిలిన దేశాలు కూడా పర్యావరణానికి ముంచుకొస్తున్న ప్రమాదంపై చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని ఈమధ్యే ఫిజీ ప్రధాని బైనిమారమా నిరాశ వ్యక్తం చేశారు. ఐపీసీసీ నివేదిక భయానక భవిష్యత్తును కళ్ల ముందు ఉంచింది. భూతాపం కారణంగా ఊహకందని విధ్వంసం చోటు చేసుకోబోతున్నదని హెచ్చరించింది. 2030నాటికి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగితే పంటల దిగుబడి గణనీయంగా తగ్గి పోతుందని, ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటివి తీవ్ర రూపం దాలు స్తాయని తెలిపింది. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగా లక్షలాదిమంది మరణిస్తారని వివరించింది. భూతాపం పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరు గుతాయని, తీర ప్రాంతాలకు ముంపు ముప్పు తప్పదని హెచ్చరించింది. వీటి ప్రభావం అత్యంత నిరుపేద వర్గాలపైనే అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ వర్గాలకు జీవనోపాధి దెబ్బతింటుం దని, ఆహార కొరత ఏర్పడుతుందని, అంటువ్యాధులు పీడిస్తాయని అంచనావేసింది.
 
అన్ని అంశాలనూ అధ్యయనం చేసి, పొంచి ఉన్న పర్యావరణ ముప్పును అంచనా వేయమని పారిస్‌ ఒడంబడిక కుదిరాక ఐక్యరాజ్యసమితి ఐపీసీసీని కోరిన పర్యవసానంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. అయితే దీని రూపకల్పన కోసం వివిధ దేశాల్లోని ప్రభుత్వాలను సంప్రదించటం, వారిచ్చిన గణాంకాలు స్వీకరించడం ప్రధాన లోపమనే చెప్పాలి. ప్రభుత్వాలు సహజంగానే పరి స్థితుల తీవ్రతను తగ్గించి చెబుతాయి. తమ లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఏ దేశమూ తాము రెండేళ్లనాటి పారిస్‌ ఒడంబడికకు అనుగుణంగా చర్యలు తీసుకోలేకపోయామని ఒప్పుకోదు. అమెరికా, సౌదీ అరేబియా వంటివైతే ఐపీసీసీకి సరిగా సహకరించనే లేదు. అంటే ఈ నివేదిక హెచ్చరిస్తున్న స్థాయికి మించే భూగోళానికి ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ప్రజలు గుర్తించాలి. తమ తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవాలి. అంతిమంగా ప్రజానీకంలో ఏర్పడే చైతన్యమే ప్రభుత్వాల మెడలు వంచగలదు.
 

మరిన్ని వార్తలు